Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 29 Apr 2023 21:01 IST

1. చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ

తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ భేటీ ముగిసింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్‌.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై దాదాపు గంటకుపైగా ఏకాంతంగా చర్చించారు. తెదేపా, జనసేన మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతున్న తరుణంలో చంద్రబాబుతో పవన్‌ భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. వినయ్‌ కిడ్నీ తీశారా? లేదా?.. పరీక్షలు చేయకుండానే తీసుకెళ్లిన బంధువులు

విశాఖ కిడ్నీ రాకెట్‌ బాధితుడు వినయ్‌కుమార్‌ను కేజీహెచ్‌ నుంచి బలవంతంగా బంధువులు తీసుకెళ్లిపోయారు. పోలీసులతో, వైద్యులతోనూ వాగ్వాదానికి దిగిన వారు వినయ్‌ను ఆటోలో మధురవాడ వాంబే కాలనీలోని ఇంటికి తీసుకెళ్లారు. సరైన వైద్యం అందించకుండా పరీక్షల పేరుతో రకరకాల విభాగాలకు తిప్పుతున్నారని, బాధితుడైన వినయ్‌కు న్యాయం చేయాల్సింది పోయి అధికార యంత్రాంగం ఈ విధంగా వ్యవహరించడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. విజయ్‌ శంకర్‌ మెరుపులు.. కోల్‌కతాపై గుజరాత్ ఘన విజయం

గుజరాత్ టైటాన్స్‌ మరోసారి అదరగొట్టింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించి గత పరాభావానికి ప్రతీకారం తీర్చుకుంది. గుజరాత్‌కు వరుసగా ఇది మూడో విజయం. ఈ గెలుపుతో హార్దిక్ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కోల్‌కతా నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. పాక్‌, చైనా మినహా.. అన్ని దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తుంది: ఎస్ జైశంకర్‌

పాకిస్థాన్‌, చైనాలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మరోసారి ధ్వజమెత్తారు. పాక్‌, చైనా మినహా మిగిలిన పొరుగు దేశాలతో భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకుంటుందన్నారు. ప్రస్తుతం డొమినికన్‌ రిపబ్లిక్‌ పర్యటనలో ఉన్న జై శంకర్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. డొమినికన్‌ రిపబ్లిక్‌లో ఆయన తొలిసారి పర్యటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. మహిళల సమాధులు తవ్వి అత్యాచారాలు.. పాక్‌లో దారుణాలు..!

పాకిస్థాన్‌లో అమ్మాయిలపై లైంగిక వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా మహిళలను మృగాళ్లు వదలట్లేదు. సమాధులను తవ్వి మరీ.. మృతదేహాలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు దేశంలో నానాటికీ పెరుగుతుండటంతో.. కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ కుమార్తెల మృతదేహాలను కాపాడుకునేందుకు వారి సమాధులకు ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ప్రతిపక్షాల ప్రయత్నాలు ఈ సారైనా ఫలించేనా?

భాజపాయేతర పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కమల దళానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌తో బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌ భేటీ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. అన్సారీ సోదరులకు జైలు శిక్ష.. లోక్‌సభ సభ్యత్వం కోల్పోనున్న మరో ఎంపీ..!

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాదాస్పద రాజకీయ నేతలు ముక్తార్‌ అన్సారీ సోదరులకు జైలు శిక్ష పడింది. కిడ్నాప్‌, హత్య ఘటనల్లో 2007లో గ్యాంగ్‌స్టర్‌ నిరోధక చట్టం కింద అన్సారీ సోదరులపై కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ జరిపిన ఉత్తరప్రదేశ్‌లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు వీరిని దోషులుగా తేల్చింది. ముక్తార్‌ అన్సారీ  (Mukhtar Ansari)కి 10 ఏళ్లు, ఆయన సోదరుడు అఫ్జల్‌ అన్సారీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. హెచ్‌-1బీ వీసా లాటరీ సిస్టమ్‌లో మోసాలు.. హెచ్చరించిన అమెరికా

హెచ్‌-1బీ వీసాదారుల (H-1B visa) ఎంపిక కోసం ఉపయోగించే కంప్యూటరైజ్డ్‌ లాటరీ సిస్టమ్‌లో మోసాలు జరుగుతున్నట్లు అగ్రరాజ్య అమెరికా (US) గుర్తించింది. కొన్ని కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు వీసాలు దక్కే అవకాశాలను పెంచుకునేందుకు ఈ లాటరీ వ్యవస్థను మోసగిస్తున్నట్లు తేలింది. దీంతో హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆధునీకరించేందుకు అమెరికా ఫెడరల్‌ ఏజెన్సీ సిద్ధమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. క్రికెటర్ల కోసం 120 ఆలూ పరాఠాలు చేశా: ప్రీతిజింట

బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఐపీఎల్‌ ఫ్రాంచైజీలోని (IPL) పంజాబ్‌ కింగ్స్ సహ యజమాని. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో (IPL 2023) తన జట్టును ప్రోత్సహించే ఆమె గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. 2009 సీజన్‌లో పంజాబ్‌ క్రికెటర్ల కోసం 120కిపైగా ఆలూ పరాఠాలను చేసినట్లు గుర్తు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

10. IAF డేరింగ్‌ ఆపరేషన్‌.. చిమ్మచీకట్లో 121 మందిని సురక్షితంగా కాపాడి..!

అంతర్యుద్ధంతో దద్దరిల్లిన సూడాన్‌(Sudan)లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత వైమానిక దళం(IAF) తీవ్రంగా శ్రమిస్తోంది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎంతో సాహసోపేతంగా ఆపరేషన్ ‘కావేరి’(Operation Kaveri)పేరిట ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 27 నుంచి 28 మధ్య రాత్రి 121 మందిని తరలించేందుకు ఎయిర్‌ఫోర్స్‌ డేరింగ్ ఆపరేషన్‌ను నిర్వహించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని