Pakistan: మహిళల సమాధులు తవ్వి అత్యాచారాలు.. పాక్‌లో దారుణాలు..!

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ (Pakistan)లో అమ్మాయిలు ఎంతటి దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారో కళ్లకు కట్టే చిత్రాలివి..! కామాంధుల బారి నుంచి తమ కుమార్తెల మృతదేహాలను రక్షించేందుకు తల్లిదండ్రులు సమాధుల చుట్టూ ఇనుపకంచెలు వేశారిలా..!

Published : 29 Apr 2023 18:25 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ (Pakistan)లో అమ్మాయిలపై లైంగిక వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా మహిళలను మృగాళ్లు వదలట్లేదు. సమాధులను తవ్వి మరీ.. మృతదేహాలపై అత్యాచారాల (Rapes)కు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు దేశంలో నానాటికీ పెరుగుతుండటంతో.. కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ కుమార్తెల మృతదేహాలను కాపాడుకునేందుకు వారి సమాధులకు ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.

మృతదేహాలతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే ఘటనలను నెక్రోఫిలియా (necrophilia) అంటారు. పాక్‌లో గత కొన్నేళ్లుగా ఈ తరహా కేసులు బయటపడుతున్నాయి. 2011లో కరాచీలోని ఉత్తర నజీమాబాద్‌లో ముహమ్మద్‌ రిజ్వాన్‌ అనే వ్యక్తిని ఇదే కేసులో అరెస్టు చేశారు. శ్మశానంలో పనిచేసే అతడు 48 మంది మహిళల మృతదేహాలను తవ్వి తీసి అత్యాచారాలకు పాల్పడ్డాడు. విచారణలో అతడే ఈ విషయాన్ని అంగీకరించాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ మధ్య కూడా తరచూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు వారి కుమార్తెల సమాధుల చుట్టూ ఇనుప కంచెలు వేశారు. ఇందుకు సంబంధించిన పాక్‌ (Pakistan) మీడియా సంస్థ డెయిలీ టైమ్స్‌ తాజాగా ఓ వ్యాసం ప్రచురించడంతో ఈ దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది.  ‘‘పాక్‌లో ప్రతి రెండు గంటలకో మహిళ అత్యాచారానికి గురవుతోంది. ఇప్పుడు మృతదేహాలను కూడా వదిలిపెట్టట్లేదు. కుమార్తెలను ఎలాగూ పోగొట్టుకున్నారు. కనీసం వారి మర్యాదనైనా కాపాడుకోవాలనేదే ఆ తల్లిదండ్రుల తాపత్రయం. అందుకే ఇలా కంచెలు వేశారు. ఈ ఫొటో చూసి యావత్‌ దేశం సిగ్గుతో ఉరేసుకోవాలి’’ అని డెయిలీ టైమ్స్‌ విచారం వ్యక్తం చేసింది. సమాధుల వద్ద ఇనుప కంచెలు వేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మానవ హక్కుల జాతీయ కమిషన్‌ గణాంకాల ప్రకారం.. పాక్‌లో దాదాపు 40శాతానికి పైగా మహిళలు తమ జీవితకాలంలో కనీసం ఒకసారైనా లైంగిక హింసను ఎదుర్కొంటున్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తే అక్కడ మహిళలపై ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని