H-1B visa: హెచ్‌-1బీ వీసా లాటరీ సిస్టమ్‌లో మోసాలు.. హెచ్చరించిన అమెరికా

హెచ్‌-1బీ వీసాలను (H-1B visa) దక్కించుకోవడం కోసం కొన్ని కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో అమెరికా అప్రమత్తమైంది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆధునీకరించేందుకు సిద్ధమైంది.

Published : 30 Apr 2023 01:08 IST

వాషింగ్టన్‌: హెచ్‌-1బీ వీసాదారుల (H-1B visa) ఎంపిక కోసం ఉపయోగించే కంప్యూటరైజ్డ్‌ లాటరీ సిస్టమ్‌లో మోసాలు జరుగుతున్నట్లు అగ్రరాజ్య అమెరికా (US) గుర్తించింది. కొన్ని కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు వీసాలు దక్కే అవకాశాలను పెంచుకునేందుకు ఈ లాటరీ వ్యవస్థను మోసగిస్తున్నట్లు తేలింది. దీంతో హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆధునీకరించేందుకు అమెరికా ఫెడరల్‌ ఏజెన్సీ సిద్ధమైంది.

అమెరికా (America) కంపెనీలు నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు హెచ్‌-1బీ వీసా (H-1B visa) అనుమతి కల్పిస్తుంది. టెక్నాలజీ కంపెనీలు దీనిపై ఆధారపడి ఏటా భారత్‌, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటాయి. ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది ఈ వీసాల (visas) కోసం దరఖాస్తు చేసుకోగా.. కంప్యూటరైజ్డ్‌ లాటరీ ద్వారా ఎంపిక చేసి అర్హులైన వారికి వీసాలు జారీ చేస్తుంటారు. ఈ లాటరీ ప్రక్రియలో కొన్ని కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) గుర్తించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఓ అసాధారణ ప్రకటన విడుదల చేసింది.

వీసాలను (H-1B visa) దక్కించుకునే అవకాశాలను పెంచుకోవడం కోసం కొన్ని కంపెనీలు ఒకే దరఖాస్తుదారు పేరుతో అనేక రిజిస్ట్రేషన్లను లాటరీలోకి ఎంటర్‌ చేస్తున్నట్లు తాము గుర్తించామని USCIS తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇటీవల చేపట్టగా.. అంతక్రితం పోలిస్తే పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చినట్లు యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది.

‘‘హెచ్‌-1బీ వీసాల (H-1B visa) కోసం ఈ ఏడాది కంప్యూటర్‌ జనరేటెడ్‌ లాటరీలో ఏకంగా 7,80,884 దరఖాస్తులు వచ్చాయి. 2023 సంవత్సరానికి ఈ సంఖ్య 4,83,927గా ఉండగా.. 2022లో  3,01,447, 2021లో 2,74,237 మంది దరఖాస్తు చేసుకున్నారు. సాధారణంగా రెండు సందర్భాల్లో ఈ సంఖ్య అమాంతం పెరుగుతంది. ఒకే లబ్ధిదారు ఎక్కువ సార్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పుడు లేదా ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నప్పుడు ఈ సంఖ్య పెరుగుతుంది. ఈ ఏడాది 4,08,891 మంది ఒకటి కంటే ఎక్కువ సార్లు లాటరీలో రిజిస్ట్రర్‌ చేసుకున్నారు. గతేడాది ఈ సంఖ్య 1,65,180 మాత్రమే. కంపెనీలు తమ ఉద్యోగులకు వీసాలు రావాలనే దురుద్దేశంతో ఇలా ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నాయి’’ అని USCIS  అని వెల్లడించింది. దీనిపై తాము దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. తప్పుడు సమాచారంతో దరఖాస్తులు చేసుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మరోవైపు, ఈ మోసాల ఘటనల నేపథ్యంలో తమ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆధునీకరించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు USCIS తెలిపింది. ‘‘మా వలస వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థకు హెచ్‌-1బీ వీసా ప్రొగ్రామ్‌ అత్యంత ముఖ్యమైనది. ఈ ప్రక్రియలో మోసాలు, దుర్వినియోగాన్ని తగ్గించేందుకు రిజిస్ట్రేషన్‌ విధానాన్ని మరింత బలోపేతం చేస్తాం’’ అని USCIS వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని