Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jun 2024 17:00 IST

1. స్కూళ్ల మూసివేత కోడి ముందా.. గుడ్డు ముందా అన్నట్లుంది: రేవంత్‌ రెడ్డి

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివి పదోతరగతిలో 10/10 జీపీఎస్‌ సాధించిన విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిభాపురస్కారాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘స్కూళ్లలో టీచర్లు లేరని విద్యార్థులు రావట్లేదు.. విద్యార్థుల్లేరని బడులు మూసివేస్తున్నారు. ఇది కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్లుగా తయారైంది’’అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. అమరావతి చేరుకున్న చంద్రబాబు.. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ముమ్మరం!

తెదేపా అధినేత చంద్రబాబు అమరావతి చేరుకున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారం నేపథ్యంలో దిల్లీ వెళ్లిన ఆయన.. నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. మరోవైపు మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎన్నికల్లో ఘన విజయం.. మొక్కులు తీర్చుకున్న పవన్‌ కల్యాణ్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అనకాపల్లిలో పర్యటించారు. పట్టణంలో నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వైకాపా ఓడినా జగన్‌ రక్తచరిత్ర రాస్తూనే ఉన్నారు: నారా లోకేశ్‌

వైకాపా ఓడిపోయినా జగన్‌ రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. కర్నూలులో తెదేపా నేత గౌరీనాథ్‌ను వైకాపా నేతలు దారుణంగా హత్య చేయించారని ఆరోపించారు. ఆ పార్టీ ఫ్యాక్షన్‌ పాలన వద్దని ఎన్నికల్లో జనం ఛీకొట్టారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మణిపుర్‌ సీఎం సెక్యూరిటీ కాన్వాయ్‌పై కాల్పులు..!

జాతుల మధ్య వైరంతో అల్లకల్లోలంగా మారిన మణిపుర్‌లో ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ సెక్యూరిటీ కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నాలు జరిగాయి. సోమవారం ఉదయం సాయుధులైన కొందరు తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సీఎం కార్యాలయానికి చెందిన వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తొలిసారి 77 వేలు దాటి.. చివరికి నష్టాల్లో సెన్సెక్స్‌

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. తొలిసారి 77 వేల పాయింట్ల స్థాయిని అధిగమించింది. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో మళ్లీ వెనక్కివచ్చింది. ఐటీ సహా కొన్ని ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్‌, నిఫ్టీలు రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ.. ప్రకటించిన దర్శకుడు

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. అ విషయాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరి అధికారికంగా ప్రకటించారు. ‘సీనియర్‌ ఎన్టీఆర్‌ మునిమనవడు.. హరికృష్ణ మనవడు.. దివంగత జానకిరామ్‌ పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావును నేను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నందుకు గర్వంగా ఉంది’ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మోదీకి పాక్‌ ప్రధాని శుభాకాంక్షలు

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏడు పొరుగు దేశాలను ఆహ్వానించినప్పటికీ.. పాకిస్థాన్‌కు మాత్రం భారత్‌ ఆహ్వానం పంపలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పార్లమెంట్‌ను రద్దు చేసిన మేక్రాన్‌.. స్నాప్‌ ఎలక్షన్స్‌కు రెడీ

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్‌ను రద్దు చేస్తూ స్నాప్‌ ఎలక్షన్స్‌(Snap Elections)కు పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన ఐరోపా యూనియన్ ఎన్నికల్లో విపక్ష పార్టీ నేషనల్ ర్యాలీకి సానుకూలత వ్యక్తమైన తరుణంలో మేక్రాన్‌ నుంచి ఈ ప్రకటన వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కిమ్ ‘చెత్త’ బెలూన్లకు లౌడ్‌ స్పీకర్లతో దక్షిణ కొరియా చెక్‌!

కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇన్ని రోజులు చెత్త, విసర్జన పదార్థాలు నిండిన భారీ గాలి బుడగలను దక్షిణకొరియాకు పంపి ఉత్తరకొరియా కవ్వించగా.. ఇప్పుడు సియోల్ అనూహ్య ప్రతిచర్యలకు దిగింది. పెద్ద పెద్ద లౌడ్  స్పీకర్లను సరిహద్దుల వద్ద మోహరించి.. ఉత్తరకొరియా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు