Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 31 Aug 2023 20:58 IST

1. సెప్టెంబరు 3 నుంచి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ

తెలంగాణలో సెప్టెంబరు 3 నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్ల పదోన్నతులు, బదిలీలపై గురువారం విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. కోర్టు తీర్పునకు లోబడి బదిలీలు చేయాలని  విద్యాశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. పారదర్శకతతో బదిలీల ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి తుమ్మల?

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్‌నేత మల్లు రవి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మలను కాంగ్రెస్‌లోకి రావాలని వారు ఆహ్వానించారు. రేవంత్‌ విజ్ఞప్తిపై మాజీ మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. పాలేరు అసెంబ్లీ టికెట్‌ దక్కక పోవటంతో తుమ్మల నాగేశ్వరరావు కొద్దిరోజులుగా భారాసకు దూరంగా ఉన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మీ సహకారం కావాలి.. ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

తెదేపా గుర్తు ‘సైకిల్’ రెండు చక్రాల్లో ఒకటి సంక్షేమానికి, మరొకటి అభివృద్ధికి ప్రతీకని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ’పై రేపటి నుంచి 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు.. 3 కోట్ల మందిని కలిసే కార్యక్రమంలో ప్రజల సహకారం, భాగస్వామ్యం కావాలని కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎలాంటి నోటిఫికేషన్లు లేవు.. ఆ ప్రచారం నమ్మొద్దు: సీఎండీ ప్రభాకర్‌రావు

విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రస్తుతం ఎలాంటి నోటిఫికేషన్లు లేవని, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని టీఎస్‌ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సూచించారు. ఇటీవల తన పేరుతో మణుగూరులో ఓ వ్యక్తి నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చినట్టు తెలిసిందన్నారు. ఈ నకిలీ అపాయింట్‌మెంట్స్‌పై విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోందని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పాతబస్తీలో పాకిస్థాన్‌ యువకుడు.. అరెస్టు!

నగరంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు పట్టుబడ్డాడు. దాయాది దేశానికి చెందిన ఫయాజ్‌ మహ్మద్‌ పాతబస్తీలో అక్రమంగా నివసిస్తున్నాడు. అంతేకాకుండా స్థానిక మహిళను వివాహం చేసుకుని నివాసం ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో అతణ్ని పాతబస్తీ బహదూర్‌పురా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈ డబ్బంతా ఎవరిది? అదానీదేనా?: రాహుల్‌ గాంధీ

అదానీ గ్రూప్‌ అక్రమాలపై ఇవాళ పలు పత్రికల్లో కథనాలు వచ్చాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఒక  బిలియన్‌ డాలర్ల ధనం భారత్‌ నుంచి వెళ్లి వివిధ మార్గాల్లో మళ్లీ తిరిగి వచ్చిందంటూ ఆ కథనాలు పేర్కొంటున్నాయని చెప్పారు. గురువారం ముంబయిలో విపక్ష కూటమి ‘ఇండియా’ సమావేశానికి విచ్చేసిన ఆయన అదానీ వ్యవహారంపై ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వయాకామ్‌ 18కే మీడియా హక్కులు.. బీసీసీఐకి ₹6 వేల కోట్లు

భారత్‌ వేదికగా బీసీసీఐ (BCCI) నిర్వహించే మ్యాచ్‌లకు సంబంధించి మీడియా హక్కులను వయాకామ్‌ 18 దక్కించుకుంది. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మొత్తం రూ.5,963 కోట్లకు ఈ హక్కులను దక్కించుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. స్వదేశంలో 2023-28 సీజన్‌లో జరగనున్న అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం వయాకామ్‌కు వచ్చింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. విమానంలో ఊపిరిపోసిన ఘటన.. ఆ చిన్నారి కథ విషాదాంతం

విమానంలో రెండేళ్ల చిన్నారి(Toddler)కి ఊపిరిపోసిన వైద్యులంటూ ఇటీవల మీడియాలో వచ్చిన వార్త అందరినీ ఎంతో ఆనందానికి గురిచేసింది. కానీ ఇంతలోనే ఆ కథ విషాదాంతమైంది. ఆ పసికందు అనారోగ్యంతో పోరాడలేక ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన కిమ్స్‌ కింగ్స్‌వే ఆసుపత్రి ఈ విషయాన్ని వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అణు జలాల భయం వేళ.. చేపను తిన్న జపాన్‌ ప్రధాని

అణు వ్యర్థ జలాలు సముద్రంలో కలవడం వల్ల కాలుష్యం పెరగడమే గాక.. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లితుందని చైనా, దక్షిణ కొరియా తదితర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  అయితే, ఈ భయాలను పోగొట్టేందుకు జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిదా (Fumio Kishida) చేసిన పని ఆసక్తికరంగా మారింది. అణు వ్యర్థ జలాలను విడుదల చేసిన ఫుకుషిమా తీరంలో పట్టిన చేపను తిన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హాస్టల్‌లో ఉరివేసుకొని.. విశాఖ విద్యార్థిని ఆత్మహత్య

దుండిగల్ ఠాణా పరిధిలో రాఖీ పండగ పూట విషాదం నెలకొంది. స్నేహితులంతా పండగ పూట ఇంటికి వెళ్లడంతో.. హాస్టల్‌లో ఒంటరిగా ఉన్న ఓ బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దుండిగల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటీ కళాశాల హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. విశాఖకు చెందిన ప్రణతి (21) ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటీ కళాశాలలో బీటెక్‌ మూడో ఏడాది చదువుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని