Rahul Gandhi: ఈ డబ్బంతా ఎవరిది? అదానీదేనా.. ఇంకెవరిదైనా?: రాహుల్‌ గాంధీ

అదానీ గ్రూప్‌ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు.

Updated : 31 Aug 2023 18:22 IST

ముంబయి: అదానీ గ్రూప్‌ అక్రమాలపై ఇవాళ పలు పత్రికల్లో కథనాలు వచ్చాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఒక  బిలియన్‌ డాలర్ల ధనం భారత్‌ నుంచి వెళ్లి వివిధ మార్గాల్లో మళ్లీ తిరిగి వచ్చిందంటూ ఆ కథనాలు పేర్కొంటున్నాయని చెప్పారు. గురువారం ముంబయిలో విపక్ష కూటమి ‘ఇండియా’ సమావేశానికి విచ్చేసిన ఆయన అదానీ వ్యవహారంపై ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘పెట్టుబడులతో అదానీ గ్రూపు షేర్ల ధరలు కృత్రిమంగా పెంచారు. షేర్ల పెరుగుదలతో వచ్చిన సొమ్ముతో అదానీ ఎన్నో ఆస్తులు కొన్నారు. అదానీ పోర్టులు, ఎయిర్‌ పోర్టులు కొనుగోలు చేశారు. ఈ డబ్బంతా ఎవరిది.. అదానీదేనా? ఇంకెవరిదైనా? ఈ మొత్తం అక్రమాల మాస్టర్‌ మైండ్‌ గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ. నాసర్‌ అలీ, ఛాంగ్‌ చుంగ్‌ లింగ్‌దీని వెనుక ఉన్నట్టు కథనాలు వచ్చాయి. గతంలో వచ్చిన ఆరోపణలపై అదానీ గ్రూప్‌నకు సెబీ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. అదానీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎన్డీటీవీలో డైరెక్టర్‌గా ఉన్నారు. దీన్నిబట్టే అదానీ గ్రూపులో ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతోంది’’ అని రాహుల్‌ అన్నారు.

అదానీ గ్రూప్‌పై మరోసారి తీవ్ర ఆరోపణలు

ఈ కుంభకోణంపై ఎందుకు విచారణ జరపరు?

‘‘అదానీ వ్యవహారంపై అంతర్జాతీయంగా ప్రముఖ ఫైనాన్షియల్‌ వార్తా పత్రికలు చాలా కీలక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మనది చాలా పారదర్శక వ్యవస్థ అని ప్రపంచానికి చెబుతున్నాం. ప్రధానికి సన్నిహితుడైన వ్యక్తి తన సంస్థ షేర్ల విలువ పెంచేందుకు బిలియన్‌ డాలర్లు విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టించారు. ఈ కుంభకోణంపై ఎందుకు విచారణ జరిపించరు?’’ అని రాహుల్‌ ప్రశ్నించారు. 

జీ20 సదస్సులో విదేశాలు ప్రశ్నిస్తే ఏం చెబుతాం?

అదానీ గ్రూప్‌ వ్యవహారంపై జేపీసీతో విచారణకు ఎందుకు అనుమతించడంలేదు.  విచారణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు చొరవ తీసుకోవడంలేదు. ఈ కుంభకోణానికి పాల్పడిన వాళ్లను జైళ్లో ఎందుకు పెట్టడంలేదు? త్వరలో దిల్లీలో జీ20 సమావేశం జరగబోతోంది. ఆ కీలక సమావేశంలో అదానీ గ్రూప్‌పై విదేశీ నేతలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతాం? ఈ అదానీ గ్రూప్‌.. ఎందుకు అంత ప్రత్యేక సంస్థగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థపై స్వారీ చేసేందుకు అదానీకి ఎందుకు అనుమతిస్తున్నారు. అదానీ గ్రూపు వ్యవహారంపై జేపీసీ వేసి సమగ్ర విచారణ జరిపించాలి’’ అని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని