Kylie Jenner: 30 కోట్ల మంది ఫాలో అవుతున్న ఏకైక మహిళ.. కైలీ జెన్నర్‌

సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో అమెరికా మోడల్‌ కైలీ జెన్నర్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ యాప్‌లో ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య ఏకంగా 30కోట్లు దాటింది

Published : 14 Jan 2022 01:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో అమెరికా మోడల్‌ కైలీ జెన్నర్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ యాప్‌లో ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య ఏకంగా 30కోట్లు దాటింది. ప్రపంచంలోనే ఇంతమంది ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్న తొలి మహిళగా అరుదైన ఘనత సాధించింది. అంతేగాక, పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తర్వాత అత్యధిక ఫాలోవర్లు ఉన్న రెండో వ్యక్తి కూడా ఈమే కావడం విశేషం. ప్రస్తుతం క్రిస్టియానో రొనాల్డో 38.8కోట్ల మంది ఇన్‌స్టా ఫాలోవర్లతో అగ్ర స్థానంలో ఉన్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌  అధికారిక ఖాతాకు 46కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన మహిళగా పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండే ఉండగా.. ఆమెను అధిగమించి కైలీ ఈ రికార్డు దక్కించుకుంది. అరియానాను ఇన్‌స్టాలో 28.9కోట్ల మంది అనుసరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా కైలీ.. ఇన్‌స్టాలో యాక్టివ్‌గా లేనప్పటికీ ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య పెరగడం విశేషం.

అమెరికా రియాల్టీ టీవీ స్టార్‌ అయిన కైలీ.. ర్యాపర్‌ ట్రావిస్‌ స్కాట్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. వీరిద్దరికి ఇప్పటికే ఓ పాప ఉండగా.. ప్రస్తుతం కైలీ రెండోసారి గర్భం దాల్చింది. సాధారణంగా ఈమె ఇన్‌స్టాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. హాట్‌ హాట్‌ ఫొటోషూట్‌లతో అభిమానులను అలరిస్తుంది. మధ్యమధ్యలో తన కుమార్తె, కుటుంబంతో దిగిన ఫొటోలు, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వీడియోలను కూడా షేర్‌ చేస్తుంది.

అయితే గతేడాది నవంబరులో ట్రావిస్‌ స్కాట్‌ నిర్వహించిన ఓ ఫెస్టివల్‌ షోలో ప్రమాదం జరిగి 10 మంది మరణించారు. ఈ ఘటన జరిగిన తర్వాత కైలీ కొంతకాలం సోషల్‌మీడియాకు బ్రేక్‌ ఇచ్చింది. ఆ తర్వాత డిసెంబరు 25న తన తల్లి క్రిస్‌ జెన్నర్‌ ఫొటోతో తిరిగి ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చింది. 2019లో కైలీ పోస్ట్‌ చేసిన ఓ గుడ్డు ఫొటో విపరీతంగా వైరల్‌ అయ్యింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని