Kashmir: హిజ్బుల్‌ కమాండర్‌ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు

కశ్మీర్‌ నుంచి ఉగ్రనిధుల ప్రవాహంపై ఎన్‌ఐఏ తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో హిజ్బుల్‌ కమాండర్‌ ఇంట్లో సోదాలు చేసింది.

Updated : 04 Aug 2023 13:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కశ్మీర్‌(Kashmir)లోని ఉగ్ర నాయకుడి ఇంటిపై జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్‌ ఒమర్‌ ఘనీపై ఉగ్రకార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. తాజాగా కుల్గామ్‌లోని అతడి ఇంటితో సహా ఐదు చోట్ల ఎన్‌ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎన్‌ఐఏ అధికారులతో పాటు సీఆర్‌పీఎఫ్‌ దళాలు కూడా పాల్గొన్నాయి.

అంజూ నిర్వాకం.. భర్త బెంచ్‌కు, సోదరుడు ఇంటికి..!

పాక్‌ సంస్థల నుంచి కశ్మీర్‌లోకి ఉగ్రనిధుల పంపిణీ కేసులో గత నెలలో జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేపట్టింది. అప్పట్లో షోపియాన్‌, పుల్వామా, కుల్గామ్‌లో దాడులు నిర్వహించింది. కశ్మీర్‌లోని హిజ్బుల్‌, జైషే, లష్కరే సంస్థలకు ఈ నిధులు చేరుతున్నట్లు ఎన్‌ఏఐ అనుమానిస్తోంది. గత కొంతకాలంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ది రెసిస్టెంట్‌ ఫ్రంట్‌, యూఎల్‌ జేఅండ్‌కే, ముజాహిద్దీన్‌ గజ్వా ఉల్‌ హింద్‌, కశ్మీర్‌ టైగర్స్‌, జమ్మూకశ్మీర్‌ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ వంటి సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో శ్రీనగర్‌, బుద్గామ్‌, కుప్వారా, పుల్వామాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల క్రితం కూడా తనిఖీలు జరిగాయి. ఈ క్రమంలో ఎన్జీవో జేకేసీసీఎస్‌ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.  ఈ సంస్థ సమన్వయకర్త ఖుర్రం పర్వేజ్‌ను అరెస్టు చేశారు.

అదృశ్యమైన జవాన్‌ జాడ దొరికింది..

గత నెల 29న ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లి.. అదృశ్యమైన ఆర్మీ జవాన్‌ జావెద్‌ అహ్మద్‌ జాడను కుల్గాం పోలీసులు గుర్తించారని నిన్న రాత్రి కశ్మీర్‌ జోన్‌ పోలీస్‌ ట్విటర్‌ హ్యాండిల్‌లో ప్రకటించింది. ఈ విషయాన్ని ఏడీజీపీ విజయ్‌ కుమార్‌ కూడా ధ్రువీకరించారు. జావెద్‌ను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లు పేర్కొన్నారు. అతడి అదృశ్యం వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు నిర్వహించనున్నారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొనే సమయానికి ఒంటిపై గాయాలేమీ లేనట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా సెలవులపై ఇళ్లకు వచ్చిన జవాన్లను అపహరించి హత్యలు చేస్తున్న ఘటనలు కశ్మీర్‌లో చోటు చేసుకొంటున్నాయి. దీంతో తాజాగా జావెద్‌ అదృశ్యం విషయం తెలియగానే భద్రతా దళాలు భారీ ఎత్తున గాలింపు ఆపరేషన్‌ చేపట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని