Anju: అంజూ నిర్వాకం.. భర్త బెంచ్‌కు, సోదరుడు ఇంటికి..!

భర్త, పిల్లలు, కుటుంబాన్ని వదిలేసి అంజూ(Anju) పాకిస్థాన్‌కు వెళ్లి మరో పెళ్లి చేసుకుంది. కానీ ఇక్కడ ఆమె కుటుంబం మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని తెలుస్తోంది.

Updated : 04 Aug 2023 12:53 IST

భోపాల్: మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని గ్వాలియర్‌కు చెందిన అంజూ(Anju)అనే మహిళ.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్‌ వెళ్లి, అతడిని పెళ్లాడింది. ఇటీవల కాలంలో ఈ వ్యవహారానికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆమె చేసిన నిర్వాకంతో భారత్‌లోని ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. 

అంజూకు ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వకుండానే పాక్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అంజూ భర్త, సోదరుడు, ఆమె తండ్రి తమ వృత్తి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీడియా కథనాలు వెల్లడించాయి. అంజూ భర్తను ఆయన పనిచేస్తోన్న సంస్థ ఉద్యోగంలోనే ఉంచినా.. ఎలాంటి పని అప్పగించడం లేదట. ఆయన్ను బెంచ్‌కు పరిమితం చేశారట. ఆమె సోదరుడు ఉద్యోగం కోల్పోయారట. అలాగే ఆమె తండ్రి టైలర్‌గా పనిచేస్తున్నారు. కానీ చుట్టుపక్కల వారు ఆ కుటుంబానికి దూరంగా ఉండటంతో ఆయనకు పని లభించడం లేదని తెలుస్తోంది. 

సీమా హైదర్‌కు సినిమా, రాజకీయ అవకాశాలు

అంజూ(Anju) పాకిస్థాన్‌(Pakistan) వెళ్లిపోయిన తర్వాత బౌనా గ్రామంలో నివసించే ఆమె తండ్రిపై గ్రామస్థులు మొదట సానుభూతి చూపించారు. తర్వాత నుంచి వారు ఆయన పట్ల వ్యతిరేకత చూపించడం ప్రారంభించారని, దాంతో ఆయన టైలరింగ్ పని కుంటుపడిందని సన్నిహితులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఆమె సరిహద్దులు దాటి వెళ్లడం, అక్కడ ప్రియుడు నస్రుల్లాను పెళ్లాడటం వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందేమో తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించామని ఇటీవల మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇక వివాహం తర్వాత అంజూ పేరు ఫాతిమాగా మారింది. ఆ జంటకు అక్కడ ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ యజమాని మొహసీన్‌ ఖాన్‌ అబ్బాసీ కొంత భూమి, నగదును బహుమతిగా ఇచ్చాడు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్‌ దిర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో వారు నివసిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని