Pollution: దిల్లీని కమ్మేసిన విషపూరిత పొగమంచు.. ట్రైనింగ్ సెషన్ రద్దు చేసుకున్న బంగ్లా జట్టు

Pollution: దిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. గత మూడు రోజులుగా వాయునాణ్యతా సూచి అతి తీవ్ర స్థాయిలోనే కొనసాగుతోంది.

Updated : 04 Nov 2023 12:36 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ( Delhi) కాలుష్యం కోరల మధ్య నలిగిపోతోంది. వరుసగా మూడోరోజు వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉంది. శనివారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 504కి చేరింది. అయితే, జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618కి పడిపోవడం పరిస్థితి తీవ్రతను వెల్లడిచేస్తోంది. విషపూరిత పొగమంచు దేశ రాజధానిని కమ్మేసింది. ఈ పరిస్థితుల మధ్య ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసుకుంది.

దిల్లీలో విష వాయువుల గాఢత ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితుల కంటే 80 రెట్లు ఎక్కువగా ఉండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం కారణంగా దిల్లీలో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు, కంటి దురదతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సీజనులో ఇలా కాలుష్య తీవ్రత పెరగడం ఇదే తొలిసారి. దీంతో దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు. రెండు వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యానికి కారణమయ్యాయి.

బాబోయ్‌.. పాస్‌పోర్టును ఇలా కూడా వాడతారా!

యోగిజీ.. వాటిని రానివ్వకండి: దిల్లీ మంత్రి

‘ప్రస్తుతం దిల్లీలో సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ బస్సులే తిరుగుతున్నాయి. కానీ యూపీ నుంచి నిషేధిత బీఎస్‌3, బీఎస్‌4 వాహనాలు ఆనంద్‌ విహార్ డిపోకు వస్తున్నాయి. విపరీతంగా పొగను వదిలే ఆ వాహనాలను పంపొద్దని యూపీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను’ అని దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ (Delhi Environment Minister Gopal Rai) ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అభ్యర్థించారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని గోపాల్‌ రాయ్ కోరారు. అలాగే ఉత్తర భారతమంతా ఇదే పరిస్థితి ఉందని అన్నారు.

ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసుకున్న బంగ్లా జట్టు..

ప్రస్తుతం భారత్‌ వన్డే ప్రపంచకప్‌(ODI World cup 2023)కు ఆతిథ్యం ఇస్తోంది. ఐసీసీ షెడ్యూల్‌ ప్రకారం.. నవంబర్‌ 6న దిల్లీ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. బంగ్లాదేశ్‌- శ్రీలంక తలపడనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఇరు జట్లు దిల్లీ చేరుకున్నాయి. అయితే, కాలుష్య తీవ్రత కారణంగా బంగ్లాదేశ్‌ జట్టు ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ‘షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం ఈ ట్రైనింగ్ సెషన్ జరగాల్సింది. మాకు ఇంకా శిక్షణకు సమయం ఉండటంతో ఈ పరిస్థితుల మధ్య ఎలాంటి ఛాన్స్ తీసుకోదల్చుకోలేదు’ అని బంగ్లా టీమ్ డైరెక్టర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని