Viral Video: బాబోయ్‌.. పాస్‌పోర్టును ఇలా కూడా వాడతారా!

పాస్‌పోర్టు గడువు ముగియడంతో.. ఓ పెద్దాయన దాన్ని రెన్యూవల్‌ కోసం తీసుకెళ్లాడు. దాని లోపలి పేజీలను చూసి కార్యాలయ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 04 Nov 2023 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విదేశాలకు వెళ్లేందుకు ఉపయోగకరంగా ఉంటుందని చాలా మంది ముందస్తుగా పాస్‌పోర్ట్‌ తీసుకుంటారు. ఒకసారి పాస్‌పోర్ట్‌ జారీ అయితే అది 10 ఏళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. దీంతో కొంతమంది దాన్ని ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారు. తిరిగి అవసరం పడేంత వరకు దాని గురించి ఆలోచించరు. 

ఈ క్రమంలో పాస్‌పోర్టు గురించి అవగాహనలేని కుటుంబ సభ్యుల చేతికి అది దొరికితే.. దాన్ని ఎలా ఉపయోగిస్తారో తెలిపే ఘటన తాజాగా చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను.. ప్రశాంత్‌ నాయర్‌ అనే వ్యక్తి ఎక్స్‌లో షేర్‌ చేశాడు. ‘‘వ్యాలిడిటీ ముగియడంతో ఓ పెద్దాయన తన పాస్‌పోర్ట్‌ను రెన్యూవల్‌ చేసేందుకు తీసుకొచ్చాడు. వాళ్ల ఇంట్లోవాళ్లు దాన్ని ఎందుకోసం ఉపయోగించారనే దానిపై ఆయనకు అవగాహన లేదు. పాస్‌పోర్ట్‌ లోపలి పేజీలను చూసిన కార్యాలయ సిబ్బంది షాక్‌ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది’’ అని ట్వీట్ చేశారు.

పాస్‌పోర్టు ప్రాముఖ్యత గురించి తెలియని పెద్దాయన కుటుంబసభ్యులు అందులో ఫోన్‌ నంబర్లు, ఇంటి ఖర్చుల వివరాలు వంటివి రాశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్లు చేశారు. ‘‘అది ఫోన్‌ బుక్‌ అనుకున్నారా? లేక పాస్‌పోర్ట్‌ అనుకున్నారా?’’, ‘‘ఏంటీ పాస్‌పోర్టును ఇలా కూడా వాడతారా?’’, ‘‘పాస్‌పోర్ట్‌తో వివిధ రకాల ఉపయోగాలు’’ అంటూ ట్వీట్‌లు పెడుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని