బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనకు యత్నం

గుజరాత్‌లోని గోద్రా అల్లర్ల(2002)పై బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి యత్నించిన 24 మంది విద్యార్థులను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 28 Jan 2023 04:30 IST

దిల్లీ వర్సిటీలో 24 మంది   విద్యార్థుల నిర్బంధం

దిల్లీ: గుజరాత్‌లోని గోద్రా అల్లర్ల(2002)పై బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి యత్నించిన 24 మంది విద్యార్థులను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ విశ్వవిద్యాలయాని(డీయూ)కి చెందిన ఆర్ట్స్‌ ఫ్యాకల్టీ భవనం గేట్‌ వద్ద శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో వీరందరూ గుమిగూడారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినా వినకపోవడంతో మొత్తం 24 మంది విద్యార్థులను నిర్బంధించినట్లు డీసీపీ(నార్త్‌) సాగర్‌ సింగ్‌ వెల్లడించారు. డీయూ ప్రాంగణంలో ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు అనుమతించబోమని అంతకుముందు వర్సిటీ వర్గాలు లిఖితపూర్వకంగా పోలీసులకు తెలియజేశాయి. ఫిబ్రవరి 28 వరకు ప్రాంగణంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, విద్యార్థులు గుమిగూడటానికి అనుమతించబోమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. క్యాంపస్‌లో పోలీసులను మోహరించారు. అయితే, వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించి తీరుతామని ఎన్‌ఎస్‌యూఐ, భీమ్‌ ఆర్మీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ విడివిడిగా ప్రకటించాయి.

* కోల్‌కతాలోని జాదవ్‌పుర్‌ విశ్వవిద్యాలయంలో దాదాపు 100 మంది విద్యార్థులు డ్యాకుమెంటరీని తిలకించారని విద్యార్థి నాయకులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని