వేదాల్లో ఉన్నవే పాశ్చాత్యుల ఆవిష్కరణలు

గణితం, వైద్యం, ఖగోళశాస్త్రం, ఆధ్యాత్మిక విద్య తదితరాలన్నీ సంస్కృతంలో రాసి ఉండడంతో వేదకాలం నుంచి మనది విజ్ఞాన సమాజమని ‘భారత అంతరిక్ష పరిశోధన సంస్థ’ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పేర్కొన్నారు.

Updated : 26 May 2023 06:01 IST

సంస్కృతంలో అన్నీ ఎప్పుడో రాసి ఉన్నాయి
ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వ్యాఖ్యలు

ఉజ్జయిని: గణితం, వైద్యం, ఖగోళశాస్త్రం, ఆధ్యాత్మిక విద్య తదితరాలన్నీ సంస్కృతంలో రాసి ఉండడంతో వేదకాలం నుంచి మనది విజ్ఞాన సమాజమని ‘భారత అంతరిక్ష పరిశోధన సంస్థ’ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పేర్కొన్నారు. అయితే ఈ విజ్ఞానమంతా కొన్నివేల ఏళ్ల తర్వాత పాశ్చాత్య శాస్త్రవేత్తల ఆవిష్కరణలుగా తిరిగి మన దేశానికి వచ్చాయని చెప్పారు. బుధవారం ఉజ్జయినిలో ‘మహర్షి పాణిని సంస్కృత, వేద విశ్వవిద్యాలయం’ నాలుగో స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ప్రపంచంలోనే ప్రాచీన భాషల్లో సంస్కృతం ఒకటి. కవిత్వం, తర్కం, వ్యాకరణం, తత్వం, శాస్త్ర సాంకేతిక రంగాలు, గణితం, ఇతర అనుబంధ పాఠ్యాంశాలన్నీ దానిలో ఉన్నాయి. సూర్య సిద్ధాంత అనే గ్రంథంలో మాకు సంబంధించిన అంశాలున్నాయి. సౌర వ్యవస్థ, సూర్యుని చుట్టూ అవి పరిభ్రమించే తీరు, దానికి పట్టే సమయం వంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడి నుంచి అరబ్బుల వద్దకు, ఆ తర్వాత ఐరోపాకు వెళ్లి మళ్లీ మనకు వచ్చాయి. సున్నా, అనంతం, బీజగణితం, పైథాగరస్‌ సిద్ధాంతం వంటివాటి గురించి సంస్కృతంలో అత్యంత కచ్చితత్వంతో కవితాత్మకంగా ఎప్పుడో మన ప్రాచీనులు వివరించారు. విశ్వం కూర్పు, లోహశాస్త్రం, వైద్య చికిత్సలు వంటివాటినీ సంస్కృతంలో పొందుపరిచారు. కంప్యూటర్‌ భాషకూ ఇది చక్కగా సరిపోతుంది’’ అని సోమనాథ్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు