ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు ఊరట

యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి అర్ధంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) కొంత ఉపశమనాన్ని కలిగించింది. ఉక్రెయిన్‌లో వివిధ కళాశాలల్లో చేరిన వైద్య విద్యార్థులు ప్రపంచంలోని

Published : 07 Sep 2022 05:39 IST

ఇతర దేశాల్లో విద్యాభ్యాసానికి ఎన్‌ఎంసీ అనుమతి

ఈనాడు, దిల్లీ: యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి అర్ధంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) కొంత ఉపశమనాన్ని కలిగించింది. ఉక్రెయిన్‌లో వివిధ కళాశాలల్లో చేరిన వైద్య విద్యార్థులు ప్రపంచంలోని ఏ దేశంలోని వైద్య విశ్వ విద్యాలయం పరిధిలోని కళాశాలల్లోకైనా తాత్కాలికంగా మారేందుకు (టెంపరరీ రీలొకేషన్‌) అవకాశం కల్పించింది. ఇతర దేశాల్లో వారు వైద్య విద్యను అభ్యసించినా ఉక్రెయిన్‌ విశ్వ విద్యాలయం డిగ్రీగానే గుర్తిస్తామని ప్రకటించింది. స్క్రీనింగ్‌ టెస్ట్‌ రెగ్యులేషన్‌-2002 నిబంధనలు పాటించి ఉక్రెయిన్‌ వెళ్లిన వైద్య విద్యార్థుల అకడమిక్‌ మొబిలిటీ విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. ఎన్‌ఎంసీ ప్రకటన ప్రకారం.. ఉక్రెయిన్‌ వైద్య కళాశాలల నుంచి వెనక్కి వచ్చిన విద్యార్థులు ప్రపంచంలోని ఏ దేశంలోని వైద్య కళాశాలల్లోకి అయినా కోర్సులను బదిలీ చేయించుకొని పూర్తి చేయొచ్చు. అలాగే ఉక్రెయిన్‌లోని కళాశాలలు తమ బోధనా సిబ్బంది ద్వారా భారతీయ విద్యార్థులకు విదేశీ కళాశాలల్లో కోర్సులు నిర్వహించినా వాటిని ఎన్‌ఎంసీ గుర్తిస్తుంది. ఈ మేరకు వైద్య విద్యార్థులకు ఉపశమనం కలిగినా భారతీయ వైద్య కళాశాలలకు వారు బదిలీ చేసుకుంటే అనుమతిస్తారా..? ఉక్రెయిన్‌ వైద్య కళాశాలలు మన వైద్య కళాశాలలకు సిబ్బందిని పంపి బోధన చేపట్టేందుకు అనుమతిచ్చారా అనే విషయంపై ఎన్‌ఎంసీ ప్రకటనలో స్పష్టత లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని