రేపు జీ-20 నాయకత్వ బాధ్యతలు స్వీకరించనున్న భారత్‌

అధికారికంగా జీ-20 దేశాల నాయకత్వ బాధ్యతలను గురువారం భారత్‌ స్వీకరించనుంది.

Published : 30 Nov 2022 04:56 IST

100 స్మారకాలపై లోగో వెలుగులు

ఈనాడు, దిల్లీ: అధికారికంగా జీ-20 దేశాల నాయకత్వ బాధ్యతలను గురువారం భారత్‌ స్వీకరించనుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 100 జాతీయ స్మారకాలపై వసుధైక కుటుంబం ఇతివృత్తంతో రూపొందించిన జీ-20 లోగోను ప్రదర్శించనున్నారు. మంగళవారం విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. జీ-20 సదస్సును దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా 50 నగరాల్లో 200 సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు రవాణా సౌకర్యం సరిగాలేని మారుమూల చారిత్రక ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యం ద్వారా దేశంలోని ప్రతి జిల్లా, తాలూకా, మండలాన్ని జీ-20తో అనుసంధానం చేయాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ఏడాది పొడవునా విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. నాయకత్వ బాధ్యతలు స్వీకరించే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 75 యూనివర్సిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

తెలుగు రాష్ట్రాలకు దక్కని చోటు

జీ-20 సదస్సు నేపథ్యంలో వచ్చే మూడు నెలల్లో నిర్వహించే కార్యక్రమాలను అధికారులు ఖరారు చేశారు. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు జరిగే కార్యక్రమ వేదికల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చోటు దక్కలేదు. ఈ మూడు నెలల కాలంలో దేశవ్యాప్తంగా 15 నగరాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణాది నుంచి బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం నగరాలకే చోటు దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని