Road Accidents: రహదారులు రక్తసిక్తం.. గంటకు 19 మంది బలి!

దేశంలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. వీటిలో గంటకు 19 మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.

Published : 31 Oct 2023 20:00 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఏటా రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరుగుతూనే ఉన్నాయి. గతేడాదిలోనే 4.6లక్షల ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 12శాతం పెరగడం ఆందోళనకర విషయం. మొత్తంగా దేశంలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. వీటిలో గంటకు 19 మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజా నివేదిక తెలిపింది.

‘భారత్‌లో రోడ్డు ప్రమాదాలు-2022’ సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (MoRTH) తాజా నివేదిక విడుదల చేసింది. 2022లో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 4,61,312 ప్రమాదాలు చోటుచేసుకోగా.. అందులో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4,43,366 మంది గాయాలపాలయ్యారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ప్రమాదాలు 11.9శాతం పెరగగా.. మరణాలు 9.4శాతం పెరిగాయి. గాయపడిన  వారి సంఖ్య 15.3శాతం పెరిగింది.

  • 2021లో 1.53లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోగా.. 2022లో ఈ సంఖ్య 1.68లక్షలకు పెరిగింది.
  • రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నమోదైన మొత్తం ప్రమాదాల్లో 71.2శాతం మరణాలు అతివేగం వల్లే చోటుచేసుకోగా.. రాంగ్‌ సైడ్‌లో ప్రయాణం వల్ల జరిగిన ప్రమాదాల్లో 5.4శాతం మంది మరణించారు.
  • మొత్తం రోడ్డు ప్రమాదాల్లో జాతీయ రహదారుల్లో 32.9శాతం, రాష్ట్ర రహదారుల్లో 23.1శాతం, మరో 43.9శాతం ప్రమాదాలు ఇతర రహదారులపై జరిగాయి.
  • బైక్‌ సంబంధిత ప్రమాదాలు తొలిస్థానంలో నిలిచాయి. కార్లు, జీపులు, టాక్సీ ప్రమాదాలు రెండోస్థానంలో ఉన్నాయి.
  • రోడ్డు ప్రమాదాలు అధికంగా తమిళనాడులో (64 వేలు), తర్వాత మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయి. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మాత్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికంగా ఉంది.
  • 67శాతం ప్రమాదాలు నేరుగా ఉన్న రోడ్లపైనే జరిగాయి. మూలమలుపులు, గుంతులు, వంపుల రోడ్లలో కలిపి మొత్తం 13.8శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
  • రోడ్డు ప్రమాద మరణాల్లో వెనకనుంచి వచ్చి ఢీకొట్టిన ఘటనల్లోనే అధికంగా (19.5) ఉన్నాయి. ఢీకొట్టి వెళ్లిపోవడం (Hit and Run) 18.1శాతం, తలకు గాయాలు (Head on Collission) 15.7శాతంగా ఉన్నాయి.
  • ఈ ప్రమాదాల్లో 18-45 ఏళ్ల వయసున్న వారే అధికంగా బాధితులుగా మారుతున్నారు. 2022లో ప్రమాదాల్లో 66.5శాతం బాధితులు వీరే.
  • ఇదిలాఉంటే, దేశంలో ఏటా సంభవిస్తోన్న రోడ్డు ప్రమాదాలు,  వీటిలో మరణాల సంఖ్యను 2024 నాటికి సగానికి తగ్గించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ లక్ష్యాన్ని నిర్దేశించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని