Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం (Odisha Train Tragedy) వందల మంది ప్రయాణికుల కలలను కబళించింది. ఈ క్రమంలోనే ‘కోరమాండల్‌’ బోగీలో (Coromandel Express) బెంగాలీ ప్రయాణికుడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ డైరీలో రాసుకున్న ‘ప్రేమ గీతాలు’ పట్టాలపై పడిఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Updated : 05 Jun 2023 09:25 IST

కోల్‌కతా: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం (Odisha Train Tragedy) దేశ రైల్వే చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదంగా నిలిచింది. అప్పుడప్పుడే చీకటి పడుతుండగా బోగీల్లో నుంచి వెన్నెల అందాల కోసం ఎదురుచూస్తూ.. తోటి ప్రయాణికులతో సరదా ముచ్చట్లు చెప్పుకొంటూ గడుపుతోన్న ప్రయాణికులకు ఒక్కసారిగా ఊహకందని విషాదం ఎదురైంది. నెత్తుటి ధారలతో ఎంతోమంది స్వప్నాలను చెరిపేస్తూ.. కాలగర్భంలో కలిపేసింది. కోరమాండల్‌ బోగీలో (Coromandel Express) ఓ బెంగాలీ ప్రయాణికుడు తన ప్రేమను వ్యక్తం చేస్తూ డైరీలో రాసుకున్న ‘ప్రేమ గీతాలు (Love Poems)’.. ఇప్పుడు మృత్యు పట్టాలపై చెల్లాచెదురయ్యాయి. ఏనుగులు, చేపల బొమ్మలు ఓ వైపు, సూర్యుడు మరోవైపు ఉన్న ఆ చిరిగిపోయిన కాగితాల ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘చిన్ని చిన్ని మేఘాలు చిరుజల్లులను కురిపించగా.. మనం వినే చిన్ని చిన్ని కథల్లోంచే ప్రేమ కుసుమాలు విరబూస్తాయి’ అని బెంగాలీలో  చేతిరాతతో రాసి ఉంది. ‘అన్నివేళలా నీ ప్రేమ కావాలి. ఎల్లప్పుడూ నువ్వు నా మదిలోనే ఉంటావు’ అని రాసి ఉన్న కాగితాలు చెల్లాచెదురైన ట్రాకులపై పడిపోయాయి. ఘటనాస్థలిలో బాధిత ప్రయాణికుల వస్తువులను వెలికి తీస్తున్న సహాయసిబ్బంది కంటపడ్డాయి. వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తమ హృదయం ముక్కలైందని కొందరు నెటిజన్లు పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం జీవితం ఊహించలేనిది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ డైరీ ఎవరిది? వారి ఆరోగ్య పరిస్థితి ఏంటనే విషయంపై మాత్రం తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని