Viral video: లండన్‌లోనూ డబ్బావాలా ఎఫెక్ట్‌: ఆనంద్‌ మహీంద్రా

వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు.

Updated : 29 Apr 2024 15:16 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. తాజాగా ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ముంబయిలో ఫుడ్ డెలివరీ చేసే డబ్బావాలా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని లండన్‌లో ఇటీవల ప్రారంభించిన ఫుడ్‌ డెలివరీ స్టార్టప్‌ గురించి మహీంద్రా వీడియోను పోస్టు చేశారు. 

 ఉదయం హడావిడిగా ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే వారికి భోజన సమయంలో వారి ఇంటి నుంచి లంచ్‌ బాక్స్‌లను తీసుకొని కార్యాలయాల్లో, స్కూళ్లలో అందించడం ముంబయిలో డబ్బావాలాలు చేసే పని.

లండన్‌లోని కొందరు వ్యాపారులు డబ్బావాలాను ఆదర్శంగా తీసుకొని ఓ డెలివరీ స్టార్టప్‌ను ప్రారంభించారు. వారు ఫుడ్ ప్యాకేజింగ్ కోసం స్టీలు డబ్బాలను ఉపయోగిస్తూ పన్నీర్ సబ్జీ, మిక్స్‌డ్ వెజిటబుల్‌ రైస్ వంటి భారతీయ వంటలను స్వయంగా వండి ఆర్డర్‌లను ప్యాక్ చేస్తున్నారు. అనంతరం వాటిని బట్టతో చుట్టి కార్గో బైక్‌లలో డెలివరీ చేస్తున్నారు. ఈ వీడియోను షేర్‌ చేస్తూ మహీంద్రా ‘‘రివర్స్‌ కాలనైజేషన్ అవుతుందని చెప్పడానికి ఇంతకంటే మెరుగైన, ‘రుచికరమైన’ సాక్ష్యం లేదు!’’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.

భారత్‌లో మొదలైన ఓ స్టార్టప్‌ లండన్‌లో గుర్తింపు పొంది, అక్కడి ప్రజలు ఆదరిస్తుండడంతో నెటిజన్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘ఇది వలసవాదమా లేక వ్యాపార అవకాశమా’ అని రాసుకొచ్చారు. ‘ప్లాస్టిక్‌ భూతం నుంచి భూమిని రక్షించుకోవడానికి వెనక్కివెళ్లడం ఒక్కటే పరిష్కారం’ అని మరో నెటిజన్ స్పందించారు. మరో నెటిజన్‌ స్పందిస్తూ ‘వివిధ నగరాలు, దేశాల్లో ఇటువంటి స్టార్టప్‌లను అమలుచేయడానికి డబ్బావాలా ఓ కేస్‌ స్టడీలా ఉపయోగపడుతోంది’ అని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు