Hemant Soren: సీఎం 30 గంటల పాటు ‘మిస్సింగ్‌’.. నాడు తండ్రి శిబు కూడా..!

ఝార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్‌ కూడా గతంలో ఓసారి కొన్ని రోజుల పాటు కన్పించకుండా పోయారు. దీంతో తాజాగా సీఎం సోరెన్‌ ‘మిస్సింగ్‌’ను నాటి ఘటనతో పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్టులు పెడుతున్నారు. 

Updated : 30 Jan 2024 19:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్‌ (Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) కొన్ని గంటల పాటు అందుబాటులో లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. అరెస్టు భయంతోనే ఆయన ‘పారిపోయారు’ అంటూ భాజపా విమర్శనాస్త్రాలు గుప్పించింది. ఎట్టకేలకు ఈ మధ్యాహ్నం ఆయన రాంచీలో ప్రత్యక్షమయ్యారు. అయితే, గతంలో హేమంత్‌ తండ్రి శిబు సోరెన్‌ (Shibu Soren) కూడా ఓసారి ఇలాగే కొన్ని రోజుల పాటు కన్పించకుండా పోయారు. దీంతో తాజా ‘మిస్సింగ్‌’ను నాటి ఘటనతో పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ అప్పుడు ఏం జరిగిందంటే..?

10 రోజుల పాటు అదృశ్యమై..

2004లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో శిబు సోరెన్‌ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఆయనపై అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది. కొన్ని దశాబ్దాల క్రితం ఝార్ఖండ్‌లోని చిరుదిలో జరిగిన ఘర్షణల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో శిబును అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ వారెంట్‌ జారీ అవగానే ఆయన కనిపించకుండా పోయారు. దీంతో ఆయన కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి ఝార్ఖండ్‌, దిల్లీలో విస్తృతంగా గాలించారు. ఇంత జరుగుతున్నా నాటి యూపీఏ ప్రభుత్వం దీనిపై మౌనం వహించింది. కేంద్రం ఒత్తిడితో కొన్ని రోజులకు శిబు సోరెన్ తన రాజీనామాను అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు పంపించారు. అయినప్పటికీ ఆయన ఎక్కడున్నారన్నది తెలియరాలేదు. చివరకు 10 రోజుల తర్వాత రాంచీలో ప్రత్యక్షమయ్యారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఝార్ఖండ్‌లోని అడవుల్లో ఉన్న గ్రామాలకు వెళ్లానని అప్పుడు శిబు చెప్పడం గమనార్హం.

రాంచీకి చేరుకున్న సోరెన్‌.. సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్‌

హేమంత్‌ ఎక్కడికెళ్లారు..?

ఇప్పుడు సీఎం హేమంత్‌ సోరెన్‌ విషయంలోనూ సరిగ్గా ఇదే రిపీట్‌ అవ్వడంతో భాజపా విమర్శలు గుప్పిస్తోంది. వ్యక్తిగత పనుల నిమిత్తం సీఎం గతవారం రాంచీ నుంచి దిల్లీ వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఈడీ అధికారులు.. మనీలాండరింగ్‌ కేసులో ఆయనను విచారించేందుకు సోమవారం ఉదయం 9 గంటలకు అధికారిక నివాసానికి చేరుకున్నారు. హేమంత్‌ మాత్రం అక్కడ లేరు. అప్పటి నుంచి కన్పించకుండా పోయిన ఆయన.. చివరకు ఈ మధ్యాహ్నం రాంచీలో ప్రత్యక్షమయ్యారు. దాదాపు 30 గంటల పాటు సీఎం ఎక్కడికి వెళ్లారన్నది తెలియరాలేదు. దీంతో ఈ విషయాలు బయటపెట్టాలని, దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతూ రాజీవ్‌ కుమార్‌ అనే అడ్వకేట్‌ కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని