Hemant Soren: రాంచీకి చేరుకున్న సోరెన్‌.. సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్‌

ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్(Hemant Soren) నుంచి స్పందన కోసం అందరిలాగే తానూ ఎదురుచూస్తున్నట్లు ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ వెల్లడించారు.

Updated : 30 Jan 2024 15:15 IST

రాంచీ: త్వరలో నాయకత్వంలో మార్పు ఉంటుందన్న ఊహాగానాలతో ఝార్ఖండ్‌(Jharkhand) రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే సీఎం హేమంత్‌  సోరెన్ నివాసంతోపాటు రాజ్‌భవన్‌, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉండగా.. గత కొన్ని గంటలుగా అందుబాటులో లేని సోరెన్‌.. తాజాగా రాంచీ చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం సతీమణి కల్పనా కూడా పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

రూ.36లక్షలు, కార్లు స్వాధీనం..

భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సోమవారం దిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు. 13 గంటల పాటు ఎదురుచూశారు. కానీ ఆయన మాత్రం వారికి అందుబాటులోకి రాలేదు. సోదాల్లో భాగంగా అధికారులు రెండు బీఎండబ్ల్యూ కార్లు, దస్త్రాలు, రూ.36 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. జనవరి 31న రాంచీలోని తన నివాసానికి రావాలని సోరెన్‌ ఇప్పటికే ఈడీ అధికారులకు సందేశం పంపారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయనను విచారించే అవకాశాలున్నట్లు కన్పిస్తోంది. ఈ పరిణామాలతో సీఎం మిస్సింగ్ అంటూ భాజపా విమర్శలు గుప్పించింది. సోరెన్‌ చిత్రంతో ఉన్న పోస్టర్‌ను ఎక్స్‌లో పోస్టు చేసి, ఆయన గురించి సమచారం ఇచ్చిన వారికి  రూ.11 వేల రివార్డు ప్రకటించింది.

ఎమ్మెల్యేలంతా రాంచీకి.. సోరెన్‌ సతీమణికి సీఎం పగ్గాలు..?

సీఎం స్పందన కోసం ఎదురుచూస్తున్నా: గవర్నర్‌

తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి సోరెన్ నుంచి స్పందన కోసం అందరిలాగే తానూ ఎదురుచూస్తున్నట్లు ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ వెల్లడించారు. ‘చట్టానికి ఎవరూ అతీతులు కాదని నేను చెప్తూనే ఉన్నాను. రాజ్యాంగం పరిధిలోనే మనమంతా పనిచేయాలి. రాజకీయంగా ఉన్న విభేదాలతో నాకు సంబంధం లేదు. ఎట్టిపరిస్థితుల్లో శాంతిభద్రతలకు మాత్రం విఘాతం కలగకూడదు’ అని గవర్నర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని