Published : 14 Oct 2020 13:56 IST

‘ఆ చోటుకు రమ్మన్నాడు.. నేను షాకయ్యా!’

‘ఆయన భార్యకు కూడా చెప్పాం..!’

హైదరాబాద్‌: ప్రముఖ గాయని చిన్మయి.. సాహిత్య రచయిత వైరముత్తుపై మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. చిత్ర పరిశ్రమలో, వివిధ రంగాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రారంభించిన ‘మీటూ’ ఉద్యమం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఆ సమయంలో చిన్మయి తొలిసారి వైరముత్తుపై ఆరోపణలు చేశారు. ఓ కాన్సర్ట్‌ కోసం విదేశానికి వెళ్లినప్పుడు తనను గదికి రమ్మని వైరముత్తు వేరొకరితో చెప్పి పంపాడని ఆమె అనడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత కూడా పలువురు మహిళలు వైరముత్తుపై వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే వీటిని ఆయన ఖండించారు.

ఇప్పుడు రెండేళ్ల తర్వాత వైరముత్తుపై ఆరోపణలు చేస్తూ ఓ మహిళ పంపిన సందేశాన్ని చిన్మయి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. తన పేరు, వివరాలు బయటపెట్టొద్దని సదరు మహిళ చిన్మయిని కోరారు. దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను గాయని సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ‘దాదాపు రెండేళ్లు పూర్తయింది.. అయినా ఇంకా ‘మీటూ’ ఆరోపణల పరంపర కొనసాగుతోంది. ఈ మహిళ తనకు ఎదురైన వేధింపులు నాకు చెప్పడానికి రెండేళ్ల సమయం పట్టింది. కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడం వల్ల ఇన్నాళ్లూ మౌనంగా ఉంది. ఆమె నాకు చాలా కాలం నుంచి తెలుసు. అయినా.. ఇలాంటి సమస్యల్ని మన సమాజం, ప్రజలు పట్టించుకోరు కదా?’ అని చిన్మయి అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘మీటూ’ ఉద్యమం నుంచి మీకు (చిన్మయిని ఉద్దేశిస్తూ) ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నా. కానీ మా అత్తామామలు అనుమతించకపోవడంతో చెప్పలేకపోయా. దయచేసి నా పేరు బయటపెట్టొద్దు. నేను కాలేజీలో ఉన్న రోజుల్లో ఓ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్లా. అక్కడ వైరముత్తు ఆటోగ్రాఫ్‌ తీసుకున్నా. ఆయన ఫోన్‌ నెంబరు రాశాడు. అప్పుడు చాలా చిన్నదాన్ని. నెంబరు ఎందుకిచ్చారనే విషయాన్ని పట్టించుకోలేదు. ఆపై కొన్నాళ్లకు నేను ఓ ప్రముఖ తమిళ ఛానెల్‌లో పనిచేస్తున్న సమయంలో వైరముత్తు నన్ను కలిశాడు. నా ఫోన్‌ నెంబరు అడిగాడు. ఇలాంటివి (వేధింపులు) ఊహించకుండా.. రెండో ఆలోచన లేకుండా నా నెంబరు ఇచ్చేశా. అప్పటి నుంచి నాకు తరచూ ఫోన్‌ చేస్తూ, సందేశాలు పంపుతూ వేధిస్తూనే ఉన్నాడు. ఆయన బుద్ధి తెలుసుకొని.. షాక్‌ అయ్యా. మౌంట్‌ రోడ్డు దగ్గరున్న ఓ చోటుకు రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. నేను పట్టించుకోవడం మానేశా. అయినా సరే ఫోన్‌కాల్స్‌ ఆగలేదు. గంట వ్యవధిలో 50 కాల్స్‌ చేసేవాడు. నేను నెంబరు మార్చినప్పటికీ.. తెలుసుకునేవాడు. ఆ తర్వాత మా ఛానెల్‌ యజమానులు కల్పించుకుని ఆయన భార్యతో చెప్పారు. ఆమె వైరముత్తు నోరు మూయించింది’ అని సదరు మహిళ సందేశాలు పంపారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని