Manobala: ప్రముఖ హాస్య నటుడు మనోబాల కన్నుమూత

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు మనోబాల (Manobala) బుధవారం కన్నుమూశారు.

Updated : 03 May 2023 17:21 IST

చెన్నై: తమిళనాడుకు చెందిన ప్రముఖ హాస్య నటుడు, దర్శకుడు మనోబాల (69) (Manobala) కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన గత రెండు వారాలుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. మనోబాల మృతి తమిళ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా రాణించిన మనోబాల (Manobala) తెలుగు ప్రేక్షకులకూ సుపరిచతమే. ఆయన నటించిన తమిళ సినిమాలు డబ్బింగ్‌ అవడంతో తెలుగు అభిమానులకు చేరువయ్యారు. ఇక తెలుగులో ఆయన మహానటి, దేవదాసు, రాజ్‌దూత్‌, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో న్యాయమూర్తిగా కనిపించారు.

1970ల్లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మనోబాల.. 1979లో భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా మారారు. ఆ తర్వాత దర్శకుడిగానూ 20కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. మూడు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు 350 సినిమాల్లో సహాయ నటుడిగా మెప్పించారు. దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించారు. పలు సీరియళ్లలోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని