సంక్షిప్త వార్తలు(4)

ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్‌ రాథోడ్‌, జయెత్రి మకానా, శివరామ్‌ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రెబల్స్‌ ఆఫ్‌ తుపాకులగూడెం’. జైదీప్‌ విష్ణు దర్శకుడు.

Published : 31 Jan 2023 01:24 IST

కన్నీళ్లతో బయటకొస్తారు!

ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్‌ రాథోడ్‌, జయెత్రి మకానా, శివరామ్‌ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రెబల్స్‌ ఆఫ్‌ తుపాకులగూడెం’. జైదీప్‌ విష్ణు దర్శకుడు. వారధి క్రియేషన్స్‌ ప్రై.లి పతాకంపై నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం పూర్తయ్యాక నాకొక విషయం అర్థమైంది. దర్శకుడు కనిపించినంత సాఫ్ట్‌ ఏం కాదు. మేమంతా కలిసి ఓ కొత్త ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుతున్నా’’ అన్నారు. ‘‘మంచి టీమ్‌ దొరకడం వల్లే.. సినిమాని ఎంతో బాగా తీయగలిగా. మణిశర్మ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నాయకానాయికలిద్దరూ తమదైన శైలిలో ఆకట్టుకుంటారు’’ అన్నారు దర్శకుడు జైదీప్‌. నటుడు ప్రవీణ్‌ కండేలా మాట్లాడుతూ.. ‘‘యాక్షన్‌, ఎమోషన్‌ అన్నీ ఉన్న చిత్రమిది. సినిమా అయిపోయాక ప్రతిఒక్కరూ కన్నీళ్లతో బయటకొస్తారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కాసర్ల శ్యామ్‌, సంతోష్‌, శ్రీకాంత్‌ అరుపుల తదితరులు పాల్గొన్నారు.


‘దళపతి67’.. అధికారికం

విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ‘దళపతి 67’ వర్కింగ్‌ టైటిల్‌తో పట్టాలెక్కిన ఈ సినిమాని ఎస్‌.ఎస్‌.లలిత్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ చిత్రాలను ముడిపెడుతూ ఓ సరికొత్త కథా ప్రపంచాన్ని సృష్టించుకున్నారు లోకేష్‌. ఇప్పుడీ చిత్రం కూడా అందులో భాగంగానే రూపొందుతున్నట్లు సమాచారం. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్‌ శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి అనిరుధ్‌ స్వరాలందిస్తున్నారు. మనోజ్‌ పరమహంస ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు.


రెండూ రెండే

ప్రస్తుతం రెండు చిత్రాలతో అభిమానుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది కరీనాకపూర్‌ ఖాన్‌. సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో ‘ది డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌’ చిత్రంతో ఆమె డిజిటల్‌ తెరపై అడుగుపెట్టబోతుంది. నెట్‌ఫ్లిక్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో పాటు హన్సల్‌ మెహతా దర్శకత్వంలోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. వీటి గురించి కరీనా మాట్లాడుతూ ‘‘నేను ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు పూర్తిగా భిన్నమైనవే. పాట, డ్యాన్స్‌, గ్లామర్‌..ఈ తరహా  అంశాలకు భిన్నంగా సాగుతాయి. రెండూ రెండే అనేలా ఆద్యంతం ఆసక్తిగా ఉంటాయి’’అని చెప్పింది. హన్సల్‌ మెహతా దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి ‘ది బకింగ్‌హమ్‌ మర్డర్స్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. దీన్ని 80 శాతం ఇంగ్లిష్‌, 20 శాతం హిందీలోనూ చిత్రీకరించారు. భర్తలేని ఓ తల్లి, తన కూతురు...ఓ హత్య నేపథ్యంలో సుజయ్‌ ఘోష్‌ చిత్రం సాగుతుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.


పైరసీ... ప్రేమకథ

వీన్‌ చంద్ర, గాయత్రీ సురేష్‌ జంటగా నటించిన చిత్రం ‘మాయగాడు’. జిఎస్‌ కార్తీక్‌ రెడ్డి తెరకెక్కించారు. భార్గవ్‌ మన్నె నిర్మాత. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇటీవల చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘పైరసీ నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది. ఇందులో నాయకానాయికలు సినిమాల్ని పైరసీ చేస్తుంటారు. దాని వల్ల చిత్ర పరిశ్రమకు కలిగే నష్టాలను ఈ చిత్రంలో చూపించనున్నాం’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని