bak: భయపెడుతూనే నవ్విస్తుంది.. బాక్‌

‘అస్సామీ జానపదంలో బాక్‌ అనే దెయ్యం ఉందని మా దర్శకుడు తన స్క్రిప్ట్‌ పరిశోధనలో తెలుసుకున్నారు. అసలు ఆ బాక్‌ కథ ఏమిటి? తను ఏం చేస్తుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అన్నారు ప్రముఖ నటి ఖుష్బూ.

Updated : 30 Apr 2024 09:43 IST

స్సామీ జానపదంలో బాక్‌ అనే దెయ్యం ఉందని మా దర్శకుడు తన స్క్రిప్ట్‌ పరిశోధనలో తెలుసుకున్నారు. అసలు ఆ బాక్‌ కథ ఏమిటి? తను ఏం చేస్తుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అన్నారు ప్రముఖ నటి ఖుష్బూ. ఆమె ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘బాక్‌’. ఖుష్బూ భర్త సుందర్‌.సి దర్శకత్వం వహించడంతోపాటు, ప్రధాన పాత్రని పోషించారు. తమన్నా, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. తమిళంలో ‘అరణ్మనై 4’గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. తమన్నా మాట్లాడుతూ ‘‘మహిళా శక్తిని చాటి చెబుతూ సినిమాలు తీసిన దర్శకుడు సుందర్‌.సి. ఆయన ఎంత మంచి దర్శకుడో చెప్పడానికి ఈ సినిమా మరో ఉదాహరణ. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. రాశీ ఖన్నాని ‘బెంగాల్‌ టైగర్‌’ నుంచీ చూస్తున్నా. తన నిజాయతీ నాకు నచ్చుతుంది. ఇందులో ‘అయ్యయ్యో...’ పాట చేస్తున్నప్పుడు చాలా ఆస్వాదించాం. హిప్‌హాప్‌ తమిళ అద్భుతమైన సంగీతం అందించారు. కిచ్చా విజువల్స్‌ ఆకట్టుకుంటాయి’’ అన్నారు. రాశీ ఖన్నా మాట్లాడుతూ ‘‘నాకు హారర్‌ సినిమాలంటే చాలా ఇష్టం. కానీ అవి తీయడం ఎంత కష్టమో ‘అరణ్మనై3’ సమయంలో తెలిసింది. ‘బాక్‌’ సినిమాకి గ్లామర్‌ మరింత పెరిగింది. తమన్నా ఇప్పటివరకూ చేయని ఓ కొత్త పాత్రలో కనిపిస్తారు. సుందర్‌.సి సర్‌కి ప్రేక్షకుల నాడి తెలుసు. హారర్‌, గ్లామర్‌, థ్రిల్‌, కామెడీ... ఇలా అన్ని అంశాలూ ఇందులో  ఉన్నాయి. కోవై సరళతో పనిచేయడం మంచి అనుభవం. ఆమె నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. వేసవికి తగ్గ సినిమా ఇది. కుటుంబమంతా కలిసి ఆస్వాదించేలా ఉంటుంది’’ అన్నారు. కోవై సరళ మాట్లాడుతూ ‘‘భయపెడుతూ నవ్వించే చిత్రమిది. చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుండడం ఆనందంగా ఉంద’’న్నారు. ‘‘అరణ్మనై’ సిరీస్‌లో వచ్చే సినిమాల్ని చూడటానికి చిన్న పిల్లలతో కలిసి మహిళలు థియేటర్‌కి వస్తుంటారు. కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్‌కి తీసుకొచ్చే విషయంలో  ‘బాక్‌’ మరో అడుగు ముందుకు వేస్తుంది’’ అన్నారు ఖుష్బూ. ఈ కార్యక్రమంలో నిర్మాత జాన్వి నారంగ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని