Puri Musings: ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్‌

‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో పూరి జగన్నాథ్‌ మరో స్పెషల్‌ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు.

Published : 30 Apr 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వెంటనే కోలుకొని సాధారణ జీవితాన్ని ప్రారంభించాలని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్‌’ (Puri Musings) పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్న ఆయన తాజాగా మరో సందేశాత్మక వీడియోతో పలకరించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

‘మన శరీరానికి ఏదైనా గాయమైతే మన బాడీ దాన్ని తగ్గించే పనిలో పడిపోతుంది. కొన్ని దెబ్బలు తగ్గడానికి రోజులు పడుతుంది. మరికొన్ని నయం కావడానికి వారాలు పట్టొచ్చు. కానీ, గాయమైతే తగ్గిపోతుంది. అలాగే ఒక్కోసారి మన మనసుకు దెబ్బ తగులుతుంది. కన్నవాళ్లు చనిపోవచ్చు, కష్టానికి ప్రతిఫలం దక్కకపోవచ్చు, నమ్మినవాళ్లు మోసం చేయొచ్చు. వీటివల్ల మనసుకు తగిలిన గాయాన్ని మనమే నయం చేసుకోవాలి. అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఏం జరిగినా.. ఎంత అనర్థం జరిగినా త్వరగా మాములు మనిషిగా మారాలి. మానసికంగా దృఢంగా ఉండాలి. రోజులతరబడి ఏడుస్తూ ఉండకూడదు. ఎంత ఏడ్చినా ఉపయోగం లేనప్పుడు, జరిగిన నష్టం భర్తీ కానప్పుడు ఎందుకు ఏడవాలి? వీలైనంత త్వరగా అందులోనుంచి బయటకు రావాలి’.

‘పక్కవారి సానుభూతి కోసం ఎప్పుడూ ఎదురుచూడొద్దు. మనల్ని ఎవరూ ఓదార్చకూడదు. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. కష్టం వచ్చినప్పుడు బాగా ఏడవండి. కానీ, వెంటనే పనిలో బిజీగా మారండి. ప్రేమలో విఫలమైన కొందరు మద్యానికి బానిసలవుతారు. దయచేసి అలా చేయకండి. అది చాలా పిచ్చి పని. ఎంత నష్టం వచ్చినా.. తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. ఎంత కష్టం వచ్చినా ఒత్తిడిగా భావించొద్దు. అన్నం తినడం మానొద్దు. నీళ్లు తాగడం ఆపొద్దు. కావాల్సినంత నిద్ర పోవాలి. మన శరీరం కోరుకునే కనీస అవసరాలు తీర్చాలి. అలా చేస్తేనే మనం కోలుకుంటాం’.

‘ఏం జరిగినా తర్వాత ఏంటి అనే ఆలోచన ఎప్పుడూ ఉండాలి. నువ్వు చనిపోతున్నావని గంట ముందు తెలిసినా.. తర్వాత ఏం చేయాలో చేసేయ్‌. ఇవన్నీ మనం బతికి ఉండడం వల్ల వచ్చిన సమస్యలు. ఊపిరి వదిలేవరకు వీటిని ఫేస్‌ చేయాల్సిందే. ఎవరికి వారే నచ్చజెప్పుకోవాలి. అలాచేసినవారే అందరికంటే గొప్పవారు’ అని చెప్పారు.

యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని