Ankitha: అందుకే నటనకు దూరం కావాల్సి వచ్చింది: ‘సింహాద్రి’ హీరోయిన్‌

సినిమాలకు ఎందుకు దూరంకావాల్సి వచ్చిందో ‘సింహాద్రి’ ఫేమ్‌ అంకిత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఎందుకంటే?

Published : 14 Jul 2023 01:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘లాహిరి లాహిరి లాహిరిలో’ (Lahiri Lahiri Lahirilo) సినిమాతో తెరంగేట్రం చేసి, ప్రేక్షకులను తొలి ప్రయత్నంలోనే విశేషంగా ఆకట్టుకున్న నటి అంకిత (Ankitha). ఆ తర్వాత ‘ధనలక్ష్మీ.. ఐ లవ్‌ యూ’, ‘ప్రేమలో పావని కల్యాణ్‌’ చిత్రాల్లో సందడి చేసి, ‘సింహాద్రి’ (Simhadri)తో ఉర్రూతలూగించారు. ఆ సినిమా ఘన విజయం అందుకోవడంతో ఆమె కెరీర్‌ గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. దానికి గల కారణాన్ని అంకిత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘విజయేంద్రవర్మ’ సినిమాపై నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ చిత్రం సక్సెస్‌ అయి ఉంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ ఉంటేనే కెరీర్‌ సాగుతుందంటూ నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.

వ్యక్తిగత విషయాలనూ ఆమె పంచుకున్నారు. హీరో నవదీప్‌తో తనకు ఎలాంటి విభేదాల్లేవని స్పష్టం చేశారు. నవదీప్‌ సరసన నటించిన చిత్రంతోపాటు తమిళంలో మరో సినిమా ఒకే సమయంలో చిత్రీకరణ సాగడంతో ఒత్తిడి ఫీలయ్యానని, ఆ క్రమంలో అసహనానికి లోనవడమే తప్ప ఎలాంటి గొడవ జరగలేదన్నారు. ఆర్తి అగర్వాల్‌, ఉదయ్‌ కిరణ్‌ మంచి తనకు స్నేహితులని తెలిపారు. వారు ఇప్పుడు లేకపోవడం బాధాకరమన్నారు. గతేడాది హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun)ని కలిశానని చెప్పారు. ఎన్టీఆర్‌తో సోషల్‌ మీడియా వేదికగా టచ్‌లో ఉన్నానని, ఆయనతోపాటు తనకు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అంటే అభిమానమన్నారు. మంచి అవకాశం వస్తే సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు సిద్ధమని తెలిపారు.

ముంబయికి చెందిన అంకితకు వ్యాపారవేత్త విశాల్‌ జగపతితో 2016లో వివాహమైంది. అనంతరం, వారు న్యూజెర్సీలో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘విజయేంద్రవర్మ’ 2004లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె.. నవదీప్‌ ‘మనసు మాట వినదు’, గోపీచంద్‌ ‘రారాజు’ సినిమాల్లో నటించారు. రవితేజ ‘ఖతర్నాక్‌’లో ఓ గీతంతో అలరించారు. 2009 నుంచి చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని