Bharat Buzz: సోనియా నివాసంలో ముఖ్యనేతల అత్యవసర భేటీ.. సర్వత్రా ఆసక్తి!

‘ఇండియా’ పేరును భారత్‌గా మార్చే యోజనలో కేంద్రం ఉందన్న వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియా గాంధీ నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారు.

Published : 05 Sep 2023 20:02 IST

దిల్లీ: ‘ఇండియా’ (India) పేరును ‘భారత్‌’గా మార్చే యోచనలో కేంద్రం ఉందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) నివాసంలో పార్లమెంటరీ పార్టీ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సమావేశం పూర్తయిన వెంటనే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) నివాసంలో భేటీ కానున్నారు. ఒకవేళ దేశం పేరును ఇకపై కచ్చితంగా ‘భారత్‌’ అని సంబోధించాల్సి వస్తే.. కూటమి పేరులోనూ ఏమైనా మార్పులు చేయాలా? లేదంటే అదే పేరుతో ఎన్నికలకు వెళ్లాలా? తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

దేశం పేరు ఇక ‘భారత్‌’? తీర్మానం చేసే యోచనలో కేంద్రం..!

భారత్‌ వేదికగా ఈ వారంతంలో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే అతిథులకు, ఇతర ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేయనున్న విందు ఆహ్వానంతో ఈ అంశం తెరమీదకు వచ్చింది. ఆహ్వాన పత్రంపై సాధారణంగా సంభోదించే ‘prsident of India’కు బదులుగా ‘president of Bharat’ అని ముద్రించారు. దీనిని గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించడం ప్రారంభించింది. మరోవైపు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా కేంద్రం నిర్ణయానికి అనుకూలంగా ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ పోస్టు చేశారు. అంతేకాకుండా సీనియర్‌ క్రికెటర్‌ సెహ్వాగ్‌ కూడా రానున్న ప్రపంచకప్‌లో ‘టీమ్‌ భారత్‌’ జెర్సీలు ధరించాలని కోరాడు. ఇలా పలువురు తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమావేశాల్లోనే పేరు మార్చే ప్రతిపాదనలు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలు ఆఘమేఘాల మీద అత్యవసర సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, విపక్ష సభ్యులు కూటమి పేరు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని