Telangana News: మొయినాబాద్‌ కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌, హీరో, విలన్‌ అంతా తెరాసనే: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ ఘటనపై భాజపా ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. నలుగురు తెరాస ఎమ్మెల్యేలను భాజపా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు తిప్పికొట్టారు.

Published : 27 Oct 2022 01:52 IST

హైదరాబాద్‌: మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ ఘటనపై భాజపా ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. నలుగురు తెరాస ఎమ్మెల్యేలను భాజపా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు తిప్పికొట్టారు. ‘‘రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే అట్టర్‌ ఫ్లాప్‌ అయినట్టు.. ఈ కథ చూస్తే అలా అనిపిస్తోంది. కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌, హీరో, విలన్‌.. అంతా వాళ్లే. తెరాస ఎమ్మెల్యేలు, తెరాస నాయకుడి ఫామ్‌హౌస్‌, డబ్బులు, యంత్రాంగం, పోలీసులు అంతా వారే.  కేవలం మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతున్నామనే ఇదంతా చేస్తున్నారు. దేశంలో ఎన్నో ఉప ఎన్నికలు జరిగాయి... ఎక్కడైనా ఒక్క నియోజకవర్గంలో 83 మంది ఎమ్మెల్యేలు మోహరించారా?మంత్రులు, ఎమ్మెల్సీలు నెల రోజుల నుంచి అక్కడే మకాం వేశారు. ఎన్ని చేసినా అక్కడ గెలిచే అవకాశం లేదని చెప్పి.. ఈ విధంగా కథలు సృష్టిస్తున్నారు. ఈ నాలుగైదు రోజుల్లో ఇంకా ఎన్ని కథలు సృష్టిస్తారో చూడాలి. గతంలో కూడా మంచి స్టోరీ చూశాం. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు రూ.కోట్లు సుపారీ ఇచ్చారని  కథ అల్లారు. ఆ కథ కంచికేనా? దానికి కారకులైన వారు తెరాస ప్లీనరీలో సెల్ఫీ దిగిన ఉదంతాలు చూశాం. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. మునుగోడులో ఓడిపోయినంత మాత్రాన ప్రభుత్వం పడిపోయేది లేదు. ఎందుకింత ఆక్రోశం. ఇలాంటి కట్టు కథల ద్వారా ప్రజల దృష్టి మరల్చలేరు’’ అని లక్ష్మణ్‌ అన్నారు.




 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని