CM KCR: త్వరలోనే పింఛన్ల పెంపుపై ప్రకటన: సీఎం కేసీఆర్‌

ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారు.. ప్రజలు నమ్మొద్దని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Updated : 20 Aug 2023 20:13 IST

సూర్యాపేట: ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారు.. ప్రజలు నమ్మొద్దని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌, సమీకృత వ్యవసాయ మార్కెట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీ, భారాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సూర్యాపేట ప్రగతి నివేదిన సభలో సీఎం మాట్లాడారు.

‘‘కాంగ్రెస్‌, భాజపా నేతలు ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. 50 ఏళ్లు అవకాశం ఇస్తే ఏం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో జిల్లాకు చెందిన చాలా మంది మంత్రులుగా పనిచేశారు.. సూర్యాపేటను అభివృద్ధి చేశారా? సూర్యాపేట, భువనగిరి, నల్గొండలో మెడికల్‌ కాలేజీలు పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నారా? సూర్యాపేట, నల్గొండ గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి. ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారు. ప్రజలు ఆగం కావొద్దు. రూ.4వేలు వృద్ధాప్య పింఛను ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో రూ.4వేలు పింఛను ఇస్తున్నారా? కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్రానికో విధానం ఉంటుందా?. మేం కూడా పింఛన్లు తప్పకుండా పెంచుతాం. పింఛన్లు ఎంతకు పెంచుతానో త్వరలోనే చెబుతా.

భారాస విజయంపై అనుమానమే లేదు..

అంచెలంచెలుగా సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతున్నాం. ఒక పార్టీ నాయకుడు మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడు.. మరో పార్టీ నాయకుడేమో 3 గంటల కరెంటు చాలంటాడు. కాంగ్రెస్‌ గెలిచిన కర్ణాటకలో అప్పుడే విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. ఇవాళ తెలంగాణలో పండే వడ్లను తరలించేందుకు లారీలు సరిపోవట్లేదు. కాంగ్రెస్‌ ఆపద్బంధు పథకం, భారాస రైతు బీమాను పోల్చి చూడాలి. ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా రైతు బంధు, రైతు బీమా డబ్బు ఖాతాలో పడుతోంది. ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. ధరణి పోర్టల్‌ తీసేస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తుంది. ఒక్కసారి ధరణిలో భూమి నమోదైతే మార్చే మొనగాడు ఉన్నారా? మండల కేంద్రంలోనే 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ అయ్యేలా ధరణి తెచ్చాం. ఓటు అనే ఆయుధాన్ని బాగా ఆలోచించి వాడుకోవాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు భారాస గెలవాలి. భారాస విజయంపై అనుమానమే లేదు. గత ఎన్నికలకంటే ఈసారి ఐదారు సీట్లు ఎక్కువే వస్తాయి’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌ వరాలు..

సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. ‘‘ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు, జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50కోట్లు మంజూరు చేస్తున్నా. రూ.25 కోట్లతో సూర్యాపేటలో కళాభవన్‌ నిర్మిస్తాం. సూర్యాపేటలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నిర్మించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డిని ఆదేశిస్తున్నా’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని