Mayawati: ఆ కూటములతో కలిసే ప్రసక్తే లేదు: మాయావతి

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయేలోగానీ, ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమిలో గానీ చేరే ప్రసక్తే లేదని బీఎస్పీ స్పష్టం చేసింది.

Published : 01 Oct 2023 18:17 IST

లఖ్‌నవూ: దేశంలోని రెండు ప్రధాన రాజకీయ కూటముల్లో చేరికపై బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (BSP) తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. అధికార ఎన్డీయేకిగానీ, ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమికిగానీ మద్దతిచ్చేది లేదని తెలిపింది. సొంత బలంతోనే లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బీఎస్పీ ఉత్తర్‌ప్రదేశ్‌ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీలో అంతర్గతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

‘‘రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీఎస్పీ ముఖ్యనేతలు, సీనియర్‌ అధికారులతో పార్టీ అధినేత్రి, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి (Mayawati) కీలక చర్చలు జరిపారు. ఎన్నికలకు ఎలా సన్నద్ధమవ్వాలన్న దానిపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా పొత్తుల అంశంపై ఆమె మరోసారి స్పష్టత ఇచ్చారు. ఏ కూటమితోనూ కలిసే ప్రసక్తే లేదని, బీఎస్పీ తన సొంత బలాన్ని నమ్ముకునే బరిలోకి దిగబోతోందని ఆమె చెప్పారు. ఎన్డీయే, ఇండియా కూటములకు దూరంగా ఉంటూ పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆమె నిర్ణయించారు’’ అని యూపీ బీఎస్పీ ఓ ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు తప్పుడు వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలను మాయావతి కోరారు. రాజకీయ కుట్రలో భాగంగా బీఎస్పీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సన్నద్ధత దెబ్బతినకుండా క్షేత్ర స్థాయి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, ఆదాయంలో తగ్గుదల, రోడ్ల దుస్థితి, శాంతిభద్రతలు, విద్యావ్యవస్థ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆమె సూచించారు. ప్రజాసంక్షేమం విషయంలో భాజపా, కాంగ్రెస్‌ పార్టీల వైఖరి దాదాపు ఒకే విధంగా ఉందని, ఇది ప్రజా వ్యతిరేకమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని