Nara Lokesh: సొంత జిల్లాకు ఏం చేశారు జగన్‌?

‘ముఖ్యమంత్రి జగన్‌ది ఫ్యాక్షన్‌ మనస్తత్వం.. ఆయన పాలనలో అన్ని రంగాల వారు బాధితులే’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు.

Updated : 03 Jun 2023 06:35 IST

ఆయన పాలనలో అందరూ బాధితులే
మైదుకూరు పాదయాత్రలో లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, కడప: ‘ముఖ్యమంత్రి జగన్‌ది ఫ్యాక్షన్‌ మనస్తత్వం.. ఆయన పాలనలో అన్ని రంగాల వారు బాధితులే’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. సొంత జిల్లా వైయస్‌ఆర్‌కు, పులివెందుల నియోజకవర్గానికి ఏం చేశారో జగన్‌ చెప్పగలరా అంటూ సవాల్‌ విసిరారు. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లిలో శుక్రవారం ఆయన వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమయ్యారు. అనంతరం మైదుకూరు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి కడప జిల్లాలో ప్రజలు 10కి 10 సీట్లు వైకాపాకు ఇస్తే జగన్‌ చేసింది ఏమిటని ప్రశ్నించారు. న్యాయవాదులు, వైద్యులు, వ్యాపారులు, టీచర్లు, ఐటీ నిపుణులు అందరూ జగన్‌ చేతిలో బాధితులయ్యారన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం బిహార్‌తో పోటీ పడుతోందని విమర్శించారు. ప్రస్తుతానికి షాపులు, వ్యాపారాలపై వైకాపా దాడి చేస్తోందని, మరోసారి ఓటేస్తే జగన్‌ అండ్‌ కో ఇళ్లల్లోకి దూరి దోచుకుపోతారని హెచ్చరించారు.

ఇక కాస్ట్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌

చెత్త పన్ను, బోర్డు పన్ను, కరెంట్‌ బిల్లుల పేరుతో భారీగా ప్రజలపై బాదేస్తున్నారని లోకేశ్‌ విమర్శించారు. జగన్‌ పెంచిన అడ్డగోలు పన్నులను తెదేపా అధికారంలోకి రాగానే తగ్గిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ తీసుకొచ్చామని, ఇప్పుడు కాస్ట్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ తీసుకొచ్చి తక్కువ ఖర్చుతో వ్యాపారాలు నిర్వహించేలా ప్రోత్సహిస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు పూర్తిగా మారుస్తామని, విద్య పూర్తయ్యేసరికి ఉద్యోగాలు పొందేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. న్యాయ వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామని.. మౌలిక వసతుల కల్పనకు నిధులు, కొత్త భవనాలు, జూనియర్‌ లాయర్లకు కోర్టులోనే లైబ్రరీ, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదులకు ఇళ్లు కట్టించి ఇవ్వడంతో పాటు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ను జగన్‌ చంపేశారని, అందుకోసం తనపై ఆరోపణలు చేశారని విమర్శించారు. తక్కువ ధరకే హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందిస్తే ప్రజలకు.. నిపుణులకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు.

ప్రజల నుంచి వినతుల వెల్లువ...

లోకేశ్‌ యువగళం పాదయాత్రకు జనం తండోపతండాలుగా తరలివచ్చి తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి వినతిపత్రాలు అందించి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని