Nara Lokesh: 9 నెలల్లో వస్తాం.. రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం

రాష్ట్రంలో తొమ్మిది నెలల తర్వాత తెదేపా అధికారంలోకి రాబోతోందని, వైకాపా నేతలకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వడం ఖాయమని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గానికి చెందిన 250 మందికిపైగా వైకాపా నేతలు, కార్యకర్తలు బుధవారం తెదేపాలో చేరారు.

Updated : 24 Aug 2023 13:43 IST

అక్రమంగా కేసులు పెట్టే వారెవరినీ వదలబోం
ఎగతాళి వద్దు.. మంగళగిరి కష్టమని తెలిసే దిగా..
జగన్‌లా పులివెందుల కోటలో గెలిస్తే గొప్పేముంది?
గన్నవరంలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

ఈనాడు, అమరావతి- హనుమాన్‌ జంక్షన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తొమ్మిది నెలల తర్వాత తెదేపా అధికారంలోకి రాబోతోందని, వైకాపా నేతలకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వడం ఖాయమని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గానికి చెందిన 250 మందికిపైగా వైకాపా నేతలు, కార్యకర్తలు బుధవారం తెదేపాలో చేరారు. పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటినుంచి కేసులతో తమ నేతలను వేధిస్తోందని, తనపైనా హత్య కేసు సహా 20 కేసులు పెట్టారని తెలిపారు. ‘ఇటీవల నేను గవర్నర్‌ను కలిసినప్పుడు కేసుల గురించి ప్రస్తావనకు వచ్చింది. న్యాయస్థానానికి వెళ్లారా? అని ఆయన అడిగారు. నేను వెళ్లనని చెప్పా. ఎందుకని ఆయన అడిగితే.. ఎప్పుడు జైలుకు పంపిస్తాడా? అని చూస్తున్నా అన్నా. ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు క్వాష్‌కు వెళ్లాలన్నా. అక్రమంగా కేసులు పెట్టే వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

వాళ్లిద్దరికీ రాజకీయ సమాధి కడతాం..

కృష్ణా జిల్లాలో తల్లిలాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచిన వంశీ, కొడాలి నానిని ఓడించడానికి కార్యకర్తలంతా కసితో ఉన్నారని, వారికి రాజకీయ సమాధి కడతామని లోకేశ్‌ పేర్కొన్నారు. 2019లో గెలిచాక వెళ్లిపోయిందే కాక పార్టీ కార్యాలయంపై వంశీ దాడికి పాల్పడ్డారన్నారు. పార్టీ మారే రెండ్రోజుల ముందూ తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చి పట్టిసీమ లేకపోతే మరుగుదొడ్డిలో వాడుకునేందుకు నీళ్లూ ఉండేవి కావని అన్నారని గుర్తు చేశారు. ఆయన వల్ల నాలుగేళ్లుగా పార్టీ శ్రేణులు ఇబ్బంది పడ్డాయని తెలిపారు. ఎవరిపై ఎక్కువ కేసులుంటాయో.. వారికి నామినేటెడ్‌ పోస్టులిస్తామని స్పష్టం చేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డిపై ఇప్పటికే 74 కేసులు పెట్టారని, వాటిని 100కు పెంచుకుంటానంటూ ఆయన చెప్పడం తెదేపా నేతల ధైర్యానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు.

గన్నవరం ఇన్‌ఛార్జిగా యార్లగడ్డ..

గన్నవరం ఇన్‌ఛార్జిగా యార్లగడ్డ వెంకట్రావును నియమిస్తున్నట్టు హర్షధ్వానాల మధ్య లోకేశ్‌ ప్రకటించారు. గన్నవరంలో కష్టకాలంలో పార్టీ ఇన్‌ఛార్జిగా దివంగత బచ్చుల అర్జునుడు నిబద్ధతతో కృషి చేశారంటూ ఆయన సేవలను గుర్తుచేశారు. తాను మంగళగిరిలో ఓడిపోయానంటూ ఎగతాళి చేస్తున్న వైకాపా నేతలకు లోకేశ్‌ సమాధానమిచ్చారు. ‘తెదేపాకు కంచుకోటలాంటి సీట్లు చాలానే ఉండగా.. కష్టమైనదని తెలిసీ మంగళగిరి ఎంచుకున్నా. అందరిలా కంచుకోటల్లో గెలిస్తే గొప్పేముంది? ఎప్పుడూ తెదేపా గెలవని సీటు నాకు ఇవ్వండి.. గెలిచి చూపిస్తానని కోరా. మంగళగిరిలో తెదేపా కేవలం రెండుసార్లే గెలిచింది. జగన్‌ మాదిరిగా పులివెందులలాంటి కోటల్లో పోటీ చేసి గెలవడంలో గొప్పేముంది? ఓడినా ఎక్కడికీ పోలేదు. మొన్న యువగళం పాదయాత్రకు మంగళగిరిలో వచ్చిన స్పందన చూశారుగా. ప్రతిక్షణం కార్యకర్తలకు అందుబాటులోనే ఉంటున్నా. వైకాపాలో కార్యకర్త చనిపోతే రూపాయి ఇవ్వరు. తెదేపాలో కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటికే రూ.100 కోట్లు వెచ్చించాం’ అని లోకేశ్‌ వివరించారు.

  • యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. వైకాపాలో తనతోపాటు నమ్ముకున్న వారందరికీ అన్యాయం జరిగిందన్నారు. అధికారం, పదవి కోసం తెదేపాలోకి రాలేదని, అతని (వంశీ) ఓటమే లక్ష్యమని అన్నారు.

మాట తప్పుడుకు జగన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌

యువగళం పాదయాత్రలో భాగంగా గన్నవరం నియోజకవర్గం చిన్నఆవుటపల్లి నుంచి బయలుదేరిన లోకేశ్‌.. పెదఆవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, తేలప్రోలు ప్రాంతాల్లో పర్యటించారు. చినఆవుటపల్లిలో ఉన్న లిక్కర్‌ వాకిన్‌ స్టోర్‌ వద్ద సెల్ఫీ దిగి ఛాలెంజ్‌ విసిరారు. మాట తప్పుడు, మడమ తిప్పుడుకు జగన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అని విమర్శించారు. ఆత్కూరు సహకార సంఘంలో ఉద్యోగులు రూ.3 కోట్లు స్వాహా చేశారని, 150 కుటుంబాలు నష్టపోయాయని, నలుగురు ఆత్మహత్య చేసుకున్నారని బాధితులు తెలిపారు. నెలల తరబడి పోరాడితే రూ.కోటి మాత్రమే రాబట్టుకోగలిగామన్నారు. చంద్రయాన్‌-3 విజయవంతం కావడంపై లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట నాయకులు కొనకళ్ల నారాయణరావు, కంభంపాటి రామ్మోహనరావు, యార్లగడ్డ వెంకట్రావు, కొల్లు రవీంద్ర, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, కాగిత కృష్ణప్రసాద్‌, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు.


సెల్‌ఫోన్‌ వెలుగులో..

లోకేశ్‌ ప్రసంగిస్తున్నప్పుడు కరెంట్‌ పోవడంతో కావాలనే నిలిపేశారంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. వైకాపా ప్రభుత్వం 24 గంటల విద్యుత్తు సరఫరానూ చేయలేకపోతోందని ఈ సందర్భంగా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. గతంలో తెదేపా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 24 గంటల విద్యుత్తు సరఫరా చేశామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని