YSRCP: ‘ప్రతిపక్ష అభ్యర్థులను పశువుల్లా కొన్నాం’

‘మీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా సంతలో పశువులను కొన్నట్టు మేము కొన్నాం.

Updated : 30 Sep 2023 10:24 IST

నంద్యాల పురపాలక వైస్‌ఛైర్మన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: ‘మీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా సంతలో పశువులను కొన్నట్టు మేము కొన్నాం. 2021 మార్చిలో జరిగిన పురపాలక ఎన్నికల్లో మేము, మా ఎమ్మెల్యే (శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి), మా పెద్దాయన (మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి) కలిసి 12 మంది తెదేపా అభ్యర్థులకు డబ్బులిచ్చి కొని ఏకగ్రీవంగా ఎన్నికయ్యాం. అయినాసరే మీరు.. మీ పార్టీ ఏమీ చేయలేకపోయారు. మీకు ఏమాత్రం అభిమానం లేదు. మాట్లాడేందుకు అర్హత లేదు’ అని నంద్యాల పురపాలక సంఘం వైస్‌ఛైర్మన్‌, 28వ వార్డు కౌన్సిలర్‌ పాంషావలి కౌన్సిల్‌ సమావేశంలో వ్యాఖ్యానించడం దుమారం రేపింది. నంద్యాల పురపాలక కార్యాలయంలో శుక్రవారం ఛైర్‌పర్సన్‌ మాబున్నిసా అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఎజెండాలోని అంశాలు ఆమోదించాక తెదేపా ఫ్లోర్‌లీడర్‌, 34వ వార్డు కౌన్సిలర్‌ మహబూబ్‌వలి మాట్లాడుతూ.. పురపాలక ఆస్తులను పరిరక్షించాలని కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమయంలో వైస్‌ఛైర్మన్‌ పాంషావలి ప్రతిపక్ష సభ్యులను దుర్భాషలాడారు. డబ్బులిచ్చి ప్రతిపక్ష అభ్యర్థులను కొన్నామని కౌన్సిల్‌ సాక్షిగా ప్రకటించడం ద్వారా వైస్‌ఛైర్మన్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని పలువురు ప్రజాసంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఏకగ్రీవమైన వార్డుల్లో ఉపఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని