ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్‌ మీడియా తీరు

సీఎం జగన్‌ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్‌ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది.

Updated : 19 Apr 2024 07:03 IST

సచివాలయాల వాట్సప్‌ గ్రూపుల్లో ప్రచారం

టంగుటూరు, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్‌ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. గ్రామ సచివాలయంలో జరిగే కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వాలంటీర్లు వాట్సప్‌ గ్రూపులను ఏర్పాటు చేశారు. వారి పరిధిలోని 50 ఇళ్లల్లో నుంచి ఒక్కొక్కరిని గ్రూపులో చేర్చి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేవారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదని ఎలక్షన్‌ కమిషన్‌(ఈసీ) ఇప్పటికే తేల్చిచెప్పింది. ప్రభుత్వ పథకాలు, పార్టీ వ్యవహారాలను సచివాలయాల గ్రూపుల్లో చేరవేయకూడదని నిబంధనలు పెట్టింది. ఈసీ నిబంధనలు తుంగలో తొక్కుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల గ్రూపుల్లో వైకాపాకు చెందిన సోషల్‌ మీడియా ప్రతినిధులు చేరి వాలంటీర్లకు దిశా నిర్దేశం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, మోదీలను టార్గెట్‌గా చేసి విమర్శలు చేస్తున్నారు. ఓ జాతీయస్థాయి టీవీ ఛానల్‌ సర్వే పేరుతో రాష్ట్రంలో వైకాపా తిరిగి అధికారంలోకి వస్తుందని అందులో ప్రచారం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని చంద్రబాబు చెప్పినా.. వాలంటీర్లు ఆయన హామీని నమ్మలేదంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామ సచివాలయం పేరుతో ఉన్న గ్రూపులో ఇలాంటి పోస్టులు వస్తున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 72 సచివాలయాల గ్రూపుల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని