భీమిలిలో వైకాపా ఖాళీ!

ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్‌.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం.

Published : 19 Apr 2024 06:23 IST

తెదేపాలోకి ఉద్ధృతంగా వలసలు
అవంతి వైఖరితో విసిగిపోయిన వైకాపా నేతలు, కార్యకర్తలు
వైకాపా అగ్రనేతల అరాచకాలు, భూదోపిడీతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
అయిదేళ్లలో విధ్వంసమే తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి సున్నా
తెదేపాకు ఘనవిజయం ఖాయమని అంచనాలు

ఈనాడు, విశాఖపట్నం: ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్‌.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. ఆయన ఎంతో ముచ్చటపడి, రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి విలాసవంతమైన రాజభవనం కట్టించుకున్న రుషికొండ ఇదే నియోజకవర్గంలో ఉంది. అయిదేళ్లుగా వైకాపా అగ్రనేతల భూ దందాలకు ప్రధాన అడ్డా కూడా ఈ నియోజకవర్గమే! అలాంటిచోట ఇప్పుడు వైకాపా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వేల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తెదేపాలోకి క్యూ కడుతుండటంతో అధికార పార్టీ భీమిలిలో ఖాళీ అవుతోంది. మొత్తంగా ఆ నియోజకవర్గంలో వైకాపాకు తీవ్రమైన ఎదురుగాలి వీస్తోంది.

విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మాజీ ఛైర్‌పర్సన్‌, భీమిలి మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్‌ అక్కరమాని నిర్మల, ఆమె భర్త వెంకట్రావు సహా పెద్ద సంఖ్యలో స్థానిక వైకాపా నాయకులు గురువారం చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. అక్కరమాని కుటుంబానికి భీమిలి, విశాఖ తూర్పు నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. నిర్మల విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగానూ పనిచేశారు. ఈ ఎన్నికల్లో విశాఖ తూర్పు లేదా భీమిలి వైకాపా టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ఆమె తెదేపాలో చేరడం వైకాపాకు గట్టి దెబ్బే. అయిదేళ్ల వైకాపా పాలనలో భీమిలి నియోజకవర్గం పూర్తి నిర్లక్ష్యానికి గురవడం, అభివృద్ధి పడకేయడం, వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు నోటిదురుసు, వివాదాస్పద వైఖరితో విసిగిపోయిన వైకాపా ముఖ్యనేతలంతా తెదేపా గూటికి చేరుతున్నారు. మళ్లీ తెదేపా అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో వైకాపా నుంచి వలసలు ఉద్ధృతమయ్యాయి. వలసల్ని ఆపేందుకు అవంతి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వైకాపా నాయకులు ఆయనను ఖాతరు చేయడం లేదు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు చూస్తే భీమిలిలో తెదేపాకు భారీ విజయం ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 2014లో ఇక్కడి నుంచే గెలిచి, అయిదేళ్లు మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం అక్కడ తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 3,58,873 మంది ఓటర్లున్న భీమిలిలో 1983 నుంచి తెదేపా ఆరుసార్లు, కాంగ్రెస్‌, ప్రజారాజ్యం, వైకాపా ఒక్కోసారి విజయం సాధించాయి.

ఉద్ధృతంగా వలస బాట!

వైకాపా ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజాప్రతినిధులు, దాదాపు 8-9 వేలమంది కార్యకర్తలు ఇప్పటికే తెదేపాలో చేరారు. నియోజకవర్గంలోని మూడు గ్రామీణ మండలాల పరిధిలో నాయకులు, కార్యకర్తలంతా తెదేపాలోకి వెళ్లిపోతుండటంతో వైకాపా దిక్కుతోచని స్థితిలో పడింది. ఇటీవల మజ్జివలసలో జరిగిన తెదేపా బహిరంగ సభలో భీమిలి జడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడుతో పాటు పలువురు సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తొమ్మిది పంచాయతీల నుంచి పెద్ద సంఖ్యలో వైకాపా నేతలు, కార్యకర్తలు తెదేపాలో చేరారు. కోలవానిపాలెం, కణాం, రామవరం, సింగన్నబండ, భీమన్నదొరపాలెం సర్పంచులతోపాటు పలువురు ఉపసర్పంచులు, అనంతవరం మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ఛైర్మన్‌ పెద ఎర్నాయుడు, మూడు మండలాల పరిధిలో అయిదుగురు మాజీ సర్పంచులు, ఇద్దరు మాజీ ఎంపీటీసీ సభ్యులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఒక్క దాకమర్రి గ్రామం నుంచే ఇద్దరు మాజీ ఎంపీటీసీ సభ్యులు, పలువురు సీనియర్‌ నాయకులు సహా 1,500 మంది వైకాపా కార్యకర్తలు, సింగన్నబండ, ఆర్‌.తాళ్లవలస, తాటితూరు నుంచి 1000 మంది చొప్పున, మజ్జిపేట నుంచి 500 మంది ఆ పార్టీలోకి వచ్చేశారు. నియోజకవర్గంలోని మిగతా గ్రామాల నుంచీ వైకాపా శ్రేణులు తెదేపా బాట పట్టాయి.

చేతిలో చెయ్యేసి చెప్పవా!

నియోజకవర్గంలో పార్టీ ఖాళీ అవుతుండటంతో వైకాపా అభ్యర్థి అవంతితోపాటు, ఆ పార్టీ అగ్రనేతలు తీవ్ర ఆందోళన చెబుతున్నారు. వలసల్ని ఆపేందుకు అవంతి ‘సెంటిమెంట్‌’ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. తెదేపాలోకి వెళ్లకుండా తనతోనే ఉండాలంటూ చేతిలో చెయ్యేసి ఒట్లు, భగవద్గీతపై ప్రమాణాలు చేయిస్తున్నారు. అప్పటికీ మాట విననివారి దగ్గరికి అనుచరుల్ని పంపించి బెదిరిస్తున్నారు. స్థానిక సంస్థల పదవుల్లో ఉన్నవారు తెదేపాలోకి వెళితే... వైకాపా మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 9న భీమిలి ఎంపీపీ వాసురాజు పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ‘అవంతి మమ్మల్ని చాలా అవమానించారు. నాతోపాటు, నా తల్లి కూడా సర్పంచి పదవికి రాజీనామా చేస్తారు. అన్నవరం వైస్‌ ఎంపీపీ కూడా రాజీనామా చేస్తున్నారు’ అని ఆయన మీడియా ముందు ప్రకటించారు. వైకాపా అగ్రనేతలు రంగంలోకి దిగి, బుజ్జగించి ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని