‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు

గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు.

Published : 19 Apr 2024 05:54 IST

అయిదేళ్ల పాలన అద్భుతమంటూ వక్తల కితాబు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ నాడు- నేడు’ పేరిట ‘ఓపెన్‌ మైండ్స్‌’ ఆధ్వర్యంలో కార్యశాలను పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో అజేయ కల్లం మాట్లాడుతూ.. ‘అభివృద్ధి అంటే రహదారులు, కాలువలు, భవనాలను నిర్మించడం కాదు. డబ్బులిస్తే వాటిని గుత్తేదారులు పూర్తి చేసేస్తారు. అలా కాకుండా అభివృద్ధి అనేది ఛాలెంజింగ్‌గా ఉండాలి. గత అయిదేళ్ల పాలనలో 2.30 లక్షల ఉద్యోగాలు కల్పించగా వాటిలో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే కేటాయించారు. 40 ఏళ్ల పాటు ప్రభుత్వ అధికారిగా సేవలు అందించిన నేను ఎన్నడూ చూడని అభివృద్ధి గత అయిదేళ్లలో జరిగింది. సచివాలయ, వాలంటీరు వ్యవస్థలు అద్భుతం’ అని వైకాపా ప్రభుత్వంపై అజేయ కల్లం ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందితే సరిపోతుందా అని తన ప్రసంగంలో ఒక చోట ప్రశ్నించారు. ఇతర వక్తలు మాట్లాడుతూ ‘నాడు- నేడు’తో పాఠశాలల అభివృద్ధి, విద్యతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళుతోందని వైకాపా డప్పు కొట్టారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల్లో కొందరు ఈ ప్రసంగాలతో విసుగు చెంది మధ్యలోనే బయటకు వెళ్లిపోవడం గమనార్హం. భీమవరం బ్రౌనింగ్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ మేడిది జాన్సన్‌ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యశాలలో ఓపెన్‌ మైండ్స్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.రాజశేఖరరెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు, ఎ.కృష్ణమోహన్‌, పి.సంజీవరావు తదితరులు ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని