భాజపాకు, శిందే వర్గానికి 9

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే ఎట్టకేలకు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 18 మందికి అందులో చోటుకల్పించారు. వారిలో తొమ్మిది మంది తన నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు వర్గానికి చెందినవారు కాగా.. మిగిలినవారంతా

Published : 10 Aug 2022 05:22 IST

మహారాష్ట్రలో మంత్రివర్గం విస్తరణ

18 మంది నూతన అమాత్యుల ప్రమాణ స్వీకారం

మహిళలకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై విమర్శలు

ముంబయి: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే ఎట్టకేలకు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 18 మందికి అందులో చోటుకల్పించారు. వారిలో తొమ్మిది మంది తన నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు వర్గానికి చెందినవారు కాగా.. మిగిలినవారంతా భాజపా నాయకులు. తాజా విస్తరణతో కేబినెట్‌లో సభ్యుల సంఖ్య 20కి చేరుకుంది. అయితే మంత్రివర్గంలో ఒక్క మహిళకూ స్థానం లభించలేదు. దీంతో పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శిందే ఈ ఏడాది జూన్‌ 30న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అదే రోజు భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 41 రోజులుగా మంత్రివర్గంలో వారిద్దరే ఉన్నారు. మహారాష్ట్రలో గరిష్ఠంగా 43 మంది మంత్రులు ఉండొచ్చు.  తాజాగా మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న 18 మందితో (అందరూ కేబినెట్‌ మంత్రులే) మహారాష్ట్ర గవర్నర్‌ బి.ఎస్‌.కోశ్యారీ ముంబయిలోని రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. వారిలో భాజపా తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌, రాధాకృష్ణ విఖె పాటిల్‌, సుధీర్‌ ముంగంటివార్‌, విజయ్‌కుమార్‌ గవిట్‌, గిరీశ్‌ మహాజన్‌, సురేశ్‌ ఖడే, రవీంద్ర చవాన్‌, అతుల్‌ సవే, మంగళ్‌ప్రభాత్‌ లోధా ఉన్నారు. శిందే వర్గంలోని గులాబ్‌రావ్‌ పాటిల్‌, దాదా భుసె, సంజయ్‌ రాఠోడ్‌, సందీపన్‌ భుమ్రే, ఉదయ్‌ సామంత్‌, తణజీ సావంత్‌, అబ్దుల్‌ సత్తర్‌, దీపక్‌ కేసర్కర్‌, శంభురాజ్‌ దేశాయ్‌ అమాత్య పదవులను దక్కించుకున్నారు. వివాదాస్పద నేతలుగా పేరున్న సంజయ్‌ రాఠోడ్‌, అబ్దుల్‌ సత్తర్‌, విజయ్‌కుమార్‌ గవిట్‌లను శిందే కేబినెట్‌లోకి తీసుకోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో భాజపాకు 12 మంది మహిళా ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలు ఉన్నారు. శిందే వర్గంలో ఇద్దరు శాసనసభ్యులు ఉన్నారు. ఆ వర్గానికి ఓ స్వతంత్ర సభ్యురాలి మద్దతు కూడా ఉంది. వారిలో ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, ఉద్యమకారిణి తృప్తి దేశాయ్‌ తదితరులు విమర్శలు గుప్పించారు. 

* మహారాష్ట్రలో కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్నవారికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాభినందనలు తెలిపారు. అనుభవజ్ఞులు, సుపరిపాలన అందించాలనే తపన ఉన్నవారి మేలి కలయికగా శిందే కేబినెట్‌ ఉందంటూ కితాబిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని