అన్ని గ్రామాల్లో బైక్‌ ర్యాలీలు

మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గం అంతటా సీనియర్లు, స్టీరింగ్‌ కమిటీ నాయకులు ఈనెల 7న బైక్‌యాత్రలు చేపట్టాలని.. జిల్లాల నుంచి నాయకుల్ని అక్కడకు పంపి బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర కోర్‌కమిటీ నిర్ణయించింది.

Published : 03 Oct 2022 02:43 IST

 ఇంటింటికీ పార్టీ గుర్తును తీసుకెళ్లాలి

కోర్‌కమిటీ భేటీలో కమలనాథుల నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గం అంతటా సీనియర్లు, స్టీరింగ్‌ కమిటీ నాయకులు ఈనెల 7న బైక్‌యాత్రలు చేపట్టాలని.. జిల్లాల నుంచి నాయకుల్ని అక్కడకు పంపి బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర కోర్‌కమిటీ నిర్ణయించింది. ఆదివారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మునుగోడు ఉపఎన్నిక, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కమిటీ చర్చించింది. జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్‌ బన్సల్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌తో పాటు ఉపఎన్నిక స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ వివేక్‌ వెంకటస్వామి, సీనియర్‌ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఈటల రాజేందర్‌, గరికపాటి మోహన్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, విజయశాంతి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, బంగారు శ్రుతి హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. కేంద్రం అందిస్తున్న నిధులు, అమలుచేస్తున్న పథకాలపై గ్రామాలవారీగా ప్రచారం చేయాలని కమలనాథులు అనుకున్నారు. రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు భాజపా అభ్యర్థి అన్న విషయాన్ని, పార్టీ గుర్తును గ్రామగ్రామానికీ తీసుకెళ్లాలని బన్సల్‌ సూచించారు. ఇతర నియోజకవర్గాల నుంచి వస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తల సేవలు మునుగోడులో ప్రచారానికి ఉపయోగించుకుందామని బండి సంజయ్‌ అన్నారు. 80 శాతానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లపై ఎక్కువ దృష్టిపెట్టాలని కమలనాథులు అనుకున్నారు. మునుగోడులో స్థిరపడ్డ ఆంధ్ర కుటుంబాలతో ఏర్పడ్డ పల్లెలు గణనీయంగా ఉన్నాయని, భాజపాకు వాటి మద్దతును కూడగట్టాలని గరికపాటి మోహన్‌రావు, ఒకరిద్దరు నేతలు అన్నారు. సమావేశం అనంతరం వివరాల్ని వివేక్‌ వెంకటస్వామి వివరించారు. మునుగోడులో కొత్త ఓటర్ల నమోదుకు 23వేల దరఖాస్తులు వచ్చాయని, తెరాస పెద్దఎత్తున నకిలీ ఓటర్లను నమోదు చేస్తోందని వివేక్‌ వెంకటస్వామి ఆరోపించారు. ఇది కోర్‌కమిటీలో చర్చకు వచ్చిందని, నకిలీ ఓట్లు ఓటర్ల జాబితాలో లేకుండా భాజపా పోరాటం చేస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని