వైకాపాతోనే కాపులకు గుర్తింపు

గత ప్రభుత్వాలు కాపులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని, వైకాపా పాలనలోనే కాపులకు తగిన గుర్తింపు లభించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Updated : 01 Nov 2022 06:54 IST

మూడేళ్లలో ఏం చేశాం.. ఇంకేం చేయాలో చర్చించాం
పవన్‌ మమ్మల్ని అసభ్యంగా తిట్టడం సరికాదు
వైకాపా కాపు ప్రజాప్రతినిధుల వెల్లడి
రాజమహేంద్రవరంలో అయిదున్నర గంటల సుదీర్ఘ భేటీ
జనసేన అధినేతను ఎదుర్కోవడంపైనే ప్రధానంగా చర్చ!

రాజమహేంద్రవరం (నగరపాలక సంస్థ, కంబాలచెరువు), న్యూస్‌టుడే: గత ప్రభుత్వాలు కాపులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని, వైకాపా పాలనలోనే కాపులకు తగిన గుర్తింపు లభించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అసభ్య పదజాలంతో కాపు నేతలను తిట్టడం సరికాదని ఆక్షేపించారు. త్వరలో విజయవాడలో కాపు వర్గీయులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వైకాపా కాపు నేతలతో రాజమహేంద్రవరంలో సోమవారం నిర్వహించిన సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు సాగిన ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ వంగా గీత, మాజీ మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్‌, పేర్ని నాని, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాపులకు ఈ మూడేళ్లలో ఏం చేశాం.. ఇంకేం చేస్తే బాగుంటుందన్న అంశంపై భేటీలో చర్చించామని సమావేశం అనంతరం నేతలు విలేకర్లకు వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సామాజికవర్గంతో సమానంగా కాపులకు మంత్రి పదవులు దక్కాయన్నారు. తెదేపా హయాంలో అయిదేళ్లలో కాపుల కోసం రూ.1824 కోట్లే ఖర్చు చేస్తే.. వైకాపా ప్రభుత్వం వచ్చాక వివిధ పథకాల కింద మూడేళ్లలోనే రూ.26 వేల కోట్లు విడుదల చేశామన్నారు. గత ప్రభుత్వంలో రెండు లక్షల మంది కాపులకు లబ్ధి జరిగితే వైకాపా వచ్చాక ఇప్పటికే 10 లక్షల మంది ప్రయోజనం పొందారని చెప్పారు. చంద్రబాబును గెలిపించేందుకు పవన్‌ కల్యాణ్‌ కాపుల గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. పవన్‌ మాటలకు కాపులు బాధపడుతున్నారన్నారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ తెదేపా పాలనలో కాపులు అణచివేతకు గురయ్యారన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని, అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికే పవన్‌ పార్టీ పెట్టారని ఆరోపించారు. వంగవీటి రంగా హత్య తర్వాత కాపులపై కేసులు పెడితే తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం కొట్టివేసిందన్నారు. ముద్రగడ ఉద్యమం నేపథ్యంలో కాపులపై పెట్టిన కేసులను జగన్‌ కొట్టివేశారన్నారు. మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కాపు ఉద్యమం నాటి కేసులను ఎత్తివేసిన సీఎం జగన్‌ తమ సామాజికవర్గానికి శ్రేయోభిలాషి అని వ్యాఖ్యానించారు.

175 సీట్లలో పోటీ చేసే సత్తా పవన్‌కు ఉందా?

కాపు రిజర్వేషన్లపై విలేకర్ల ప్రశ్నకు బొత్స స్పందిస్తూ అగ్రవర్ణ పేదలకు అందించాల్సిన 10 శాతం కంటే అదనంగా జోడించి లబ్ధిదారులకు మేలు చేస్తున్నామన్నారు. చిరంజీవి ఒంటరిగా పోటీ చేసి నిరూపించుకోగా, పవన్‌ మాత్రం నాకు 10 సీట్లు చాలని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. వచ్చిన సీట్లు చంద్రబాబు కాళ్ల దగ్గర పెడతారని విమర్శించారు. 175 సీట్లలో పోటీ చేసే సత్తా పవన్‌కు ఉందా అని బొత్స ప్రశ్నించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

జనసేనపైనే దృష్టి!

సమావేశ మందిరంలోకి కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మినహా ఎవరినీ రానీయలేదు. కాపు ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, అప్పలనాయుడు, కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య హాజరుకాలేదు. కాపుల్లోని ద్వితీయశ్రేణి నాయకులు, యువత ఓట్లు చీలిపోకుండా ఎలా జాగ్రత్తపడాలి, భవిష్యత్తులో జనసేన వెంట కాపులు నడవకుండా ఏం చేయాలనేదానిపై ఈ సందర్భంగా కార్యాచరణ రూపొందించినట్లు ప్రచారం సాగుతోంది. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సమావేశం మధ్యలో వెళ్లిపోగా.. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌, పలువురు నాయకులు సమావేశం చివర్లో వెళ్లిపోయారు.

కాపు వ్యక్తి సీఎం అయితే సంతోషించేవాళ్లమే

కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే సంతోషించేవాళ్లమేనని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ‘ఆయన (పవన్‌) ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సంతోషించేవాళ్లమే. కానీ ఆయన ఎవరికో కొమ్ముకాస్తుంటే ఈ జాతి చూస్తూ ఊరుకోదు. ఈ జాతికి పౌరుషం, నిజాయతీ ఉన్నాయి. ఎప్పుడూ తలవంచుకునే పరిస్థితి ఉండదు’ అని వ్యాఖ్యానించారు.


జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలు వైకాపాకు చెందిన కాపు నేతల్లో కలకలం రేపాయా అంటే సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన వైకాపా ప్రజాప్రతినిధుల సమావేశం అవుననే సమాధానం చెబుతోంది. కేవలం రెండు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు ప్రజాప్రతినిధులు రాజమహేంద్రవరంలో సమావేశం కావడం దానికి నిదర్శనమని చర్చ జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కోవడమే ప్రధాన ఎజెండాగా వాడీ…వేడి చర్చ సాగినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తదితర కీలక నేతలు ఆదివారం రాత్రికే నగరానికి చేరుకుని పలువురు నాయకులతో కీలక చర్చలు జరిపారు. సమావేశానికి ముందు ఉదయం, అనంతరం సాయంత్రం పలువురు నాయకులు మీడియాతో మాట్లాడినప్పుడు వాళ్ల మాటలన్నీ పవన్‌ కేంద్రంగానే సాగాయి. వైకాపా ప్రభుత్వం కాపులకు చేసిన మేలు, ఇంకేం చేస్తే బాగుంటుందనే దానిపై చర్చ ఉంటుందని బయటకు చెప్పినా, అందరూ జనసేనానిపై విమర్శల కోణంలోనే మాట్లాడారు. వైకాపా కాపు ఎమ్మెల్యేలు, నేతలను పవన్‌ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, దానిపై తమ కార్యాచరణ నిర్ణయించామని మాటల సందర్భంలో ఉప ముఖ్యమంత్రి చెప్పడం గమనార్హం. ఈ భేటీలో ముఖ్యంగా కాపు యువత ఓట్లు చీలిపోకుండా, పార్టీ వెంటే వారు నడిచేలా చేపట్టాల్సిన చర్యలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని