T20 WC 2024: కప్పు కొట్టే జట్టేనా..?

టీ20 ఫార్మాట్‌ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో టీమ్‌ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్‌మెంట్‌ వారిద్దరిని పక్కనబెట్టింది.

Updated : 01 May 2024 09:29 IST

ఈనాడు క్రీడావిభాగం 

టీ20 ఫార్మాట్‌ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో టీమ్‌ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్‌మెంట్‌ వారిద్దరిని పక్కనబెట్టింది. ఇక టీ20 కప్పులో కోహ్లి, రోహిత్‌ను చూడటం కష్టమేనని అనుకున్నారంతా! హార్దిక్‌ పాండ్య సారథ్యంలో భారత్‌ బరిలో దిగడం లాంఛనమేనన్న అంచనాకు వచ్చారంతా! రెండేళ్లు తిరక్కుండానే అంతా తలకిందులైంది. అప్పుడు వద్దనుకున్న కోహ్లి, రోహిత్‌ ఇప్పుడు తప్పనిసరిగా మారిపోయారు. ఏడాది కాలంగా భారత టీ20 బృందానికి కెప్టెన్‌గా కొనసాగిన పాండ్య చివరికి జట్టులో చోటే కష్టమన్న పరిస్థితి నుంచి త్రుటిలో బయటపడ్డాడు! ఏదేమైనా బీసీసీఐ సెలక్టర్లు అనుభవానికే ఓటేశారు. మరి.. సుదీర్ఘ కాలంగా ఐసీసీ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న భారత్‌కు ఈ జట్టు కప్పు అందిస్తుందా..?

2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం లభించింది. రోహిత్‌, కోహ్లి, హార్దిక్‌, సూర్యకుమార్‌, రిషబ్‌ పంత్‌, అర్ష్‌దీప్‌, అక్షర్‌ పటేల్‌, చాహల్‌ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం జట్టుకు ఎంపికైనవారిలో ఇద్దరు ముగ్గురు మినహా అంతా ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. నిరుటి వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌, కోహ్లి.. కుర్రాళ్లతో పోటీపడి పరుగులు సాధించడంతో టీ20 ప్రపంచకప్‌లో వారిద్దరికి చోటు కల్పించాలన్న డిమాండ్‌ పెరిగిపోయింది. ప్రస్తుతం వీరిద్దరూ ఫామ్‌లో ఉండటం జట్టు బలాన్ని పెంచేదే. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ 158.29 స్ట్రెక్‌రేట్‌తో 315 పరుగులు చేయగా.. కోహ్లి పరుగుల పోటీలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 10 మ్యాచ్‌ల్లో 147.49 స్ట్రైక్‌రేట్‌తో 500 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌, అమెరికాలోని మందకొడి పిచ్‌లపై వీరిద్దరి ఆట కీలకంగా మారడం ఖాయం.

రింకూకు అదే నష్టం చేసిందా?

ఇక 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. మంచానికే పరిమితమైన పంత్‌ పొట్టి కప్పుకు ఎంపికవడం సంచలనమే. సుమారు 15 నెలలు ఆటకు దూరమైనా.. ఐపీఎల్‌లో తన ఫామ్‌, ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని మళ్లీ భారత జట్టులో చోటు సంపాదించడం స్ఫూర్తినిచ్చేదే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటను మలుపు తిప్పగల సత్తా అతడి సొంతం. ఈసారి ఐపీఎల్‌లో అతడు 11 మ్యాచ్‌ల్లో 158.56 స్ట్రైక్‌రేట్‌తో 398 పరుగులు సాధించాడు. సంజు శాంసన్‌ సైతం సెలెక్టర్లు తనను ఎంపిక చేయాల్సిన పరిస్థితిని కల్పించాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు సారథ్యం వహిస్తున్నా.. పొట్టి లీగ్‌లో నిలకడగా రాణిస్తున్నా భారత జట్టుకొచ్చేసరికి ఏవేవో కారణాలతో సంజుకు సెలెక్టర్లు మొండిచెయ్యి చూపిస్తూ వచ్చారు. తనకు ఎన్ని పరీక్షలు పెట్టినా మౌనంగానే పోరాటం చేసిన సంజు చివరికి విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో 161.08   స్ట్రైక్‌రేట్‌తో 385 పరుగులు రాబట్టిన సంజు మరింత గర్వంగా జట్టులోకి వచ్చాడు. నాలుగు నెలల క్రితం వరకు మారుమోగిన రింకూకు 15 మందిలో స్థానం దక్కలేదు. చెన్నై తరఫున భారీ సిక్సర్లతో అలరిస్తూ.. చివరి ఓవర్లలో దూకుడు ప్రదర్శిస్తున్న శివమ్‌ దూబె.. రింకూకు ఖో ఇచ్చాడు. నిజానికి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన రింకూ ఆశలకు తెరవేసిందనే చెప్పాలి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో టాప్‌ఆర్డర్‌ ఫామ్‌లో ఉండటంతో పాటు.. ఇంపాక్ట్‌ నిబంధన కారణంగా మరో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌కు అతడి కంటే ముందే ఆడే అవకాశం రావడంతో.. ఈసారి లీగ్‌లో రింకూ (9 మ్యాచ్‌ల్లో 123)కు  ఎక్కువగా ఆడే అవకాశమే రాలేదు. మరోవైపు టాప్‌ఆర్డర్‌లో ఆడిన దూబె చక్కటి ఇన్నింగ్స్‌తో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దూబె 9 మ్యాచ్‌ల్లో 172.41 స్ట్రైక్‌రేట్‌తో 350 పరుగులు చేశాడు.

హార్దిక్‌ పాండ్య, యశస్వి జైస్వాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ఐపీఎల్‌లో పెద్దగా నిరూపించుకోలేదు. ఇక ఈసారి ప్రపంచకప్‌లో అత్యంత కీలకపాత్ర స్పిన్నర్లదే. ఒకప్పుడు విజయవంతమైన జోడీగా పేరుతెచ్చుకున్న మణికట్టు స్పిన్నర్లు కుల్‌దీప్‌, చాహల్‌ మళ్లీ జట్టుకట్టనున్నారు. రవి బిష్ణోయ్‌ రెండో లెగ్‌ స్పిన్నర్‌ రేసులో నిలిచినా ఫామ్‌లో ఉన్న చాహల్‌కు అవకాశం దక్కింది. వీరంతా ఐపీఎల్‌లో వికెట్ల వేటలో ముందుండటం జట్టుకు ఉత్సాహాన్నిచ్చేదే. ఈ సీజన్‌లో ఫామ్‌లో లేని పేసర్లు సిరాజ్‌, అర్ష్‌దీప్‌ నుంచి బుమ్రాకు ఏమేరకు సహకారం లభిస్తుందో పొట్టి కప్పులోనే చూడాలి! ఏదేమైనా కేఎల్‌ రాహుల్‌, రింకూ సింగ్‌లను తప్పించడం మినహాయిస్తే తప్ప.. ప్రస్తుత జట్టుపై ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు లేవు. సీనియర్లు, కుర్రాళ్లతో సమతూకంగా కనిపిస్తున్న ఈ జట్టు భారత ప్రపంచకప్‌ నిరీక్షణకు ముగింపు పలుకుతుందేమో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని