సైనిక బలగాల చేతుల్ని కట్టేసిన కాంగ్రెస్‌

ఉగ్రవాదంపై చర్యలు చేపట్టకుండా మునుపటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సైనిక బలగాల చేతుల్ని కట్టేసిందనీ, దీనికి ఓటుబ్యాంకు రాజకీయాలే కారణమని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు.

Published : 29 Nov 2022 04:51 IST

ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా చేసిన పార్టీ అది
విభజించి పాలించే వ్యూహాన్ని విడనాడాలి : మోదీ

జామ్‌నగర్‌, అహ్మదాబాద్‌: ఉగ్రవాదంపై చర్యలు చేపట్టకుండా మునుపటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సైనిక బలగాల చేతుల్ని కట్టేసిందనీ, దీనికి ఓటుబ్యాంకు రాజకీయాలే కారణమని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో జామ్‌నగర్‌ పట్టణంలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ‘అర్బన్‌ నక్సల్స్‌’ను అడుగుపెట్టనీయకుండా అడ్డుకోవాలని గుజరాత్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘అరాచకత్వం, ఉగ్రవాదం, ఆశ్రితపక్షపాతం, ఓటుబ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్‌ పాలనలో చాలా ఎక్కువగా ఉండేవి. అరాచకత్వం, ఉగ్రవాదాలను విస్తరింపజేస్తున్నవారి విషయంలో కాంగ్రెస్‌ నేతలు మౌనం వహించేవారు. ప్రజల్లో అభద్రత కనిపించేది. అలాంటి విధానాలతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోలేం. అందుకే మా ప్రభుత్వం ఇలాంటివాటిపై కఠిన వైఖరి అవలంబిస్తోంది’’ అని ప్రధాని చెప్పారు. ఉగ్రవాదం, నక్సలిజాలపై ఉక్కుపాదం మోపుతున్నామనీ, మన భూభాగంలోకి వచ్చే శత్రువులను సైనిక బలగాలు అంతమొందిస్తున్నాయని వివరించారు. కాంగ్రెస్‌ పాలనలో 2జి స్పెక్ట్రం కుంభకోణం వల్ల ఇంటర్నెట్‌ సేవలు ఖరీదయ్యాయనీ, కాంగ్రెస్‌ ఇప్పుడు అధికారంలో ఉండిఉంటే ప్రజల మొబైల్‌ఫోన్ల బిల్లులు నెలకు రూ.5,000 వరకు అయ్యేవని చెప్పారు.

విచ్ఛిన్న శక్తులకు గుజరాత్‌ ప్రజలు దూరం

భావ్‌నగర్‌ జిల్లాలోని పాలీతానా పట్టణంలో మరో సభలో ప్రధాని మాట్లాడుతూ- విభజించి పాలించాలనే వ్యూహాన్ని కాంగ్రెస్‌ పార్టీ విడనాడాలని సూచించారు. ప్రాంతాలు, సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే పద్ధతుల్ని అనుసరించడం వల్లనే కాంగ్రెస్‌ను గుజరాత్‌ ప్రజలు గతంలో తిరస్కరించారని చెప్పారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని భావించే శక్తులకు తోడ్పాటు అందించేందుకు గుజరాత్‌ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ‘గుజరాత్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు కూడా కాంగ్రెస్‌ సిద్ధాంతమంతా విభజనవాదమే. అప్పట్లో గుజరాతీలు, మరాఠీలు ఒకరితో ఒకరు పోట్లాడుకునేలా ఆ పార్టీయే చేసింది. తర్వాత కూడా వేర్వేరు సామాజిక వర్గాలవారి మధ్య వైషమ్యాలను ఎగదోసింది. కాంగ్రెస్‌ పాపాల వల్ల గుజరాత్‌ చాలా ఇబ్బందులు పడింది. తెలివైన గుజరాత్‌ ప్రజలు దీనిని అర్థం చేసుకున్నారు’ అని మోదీ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని