
Kejriwal: ఆ రెండూ ఉన్నోళ్లకే గోవాలో ప్రభుత్వోద్యోగాలు: కేజ్రీవాల్ విమర్శలు
దిల్లీ: గోవాలో నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి పెరిగిందని.. అక్కడి యువతకు ఉద్యోగాలే రావడంలేదని ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ అంశంపై చర్చించేందుకు తాను ఆ రాష్ట్రానికి వెళ్తానన్నారు. డబ్బు, పైరవీలు చేసేవారికే ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ నిరుద్యోగ సమస్యపై ఆప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన పార్టీలకు ఓటు వేయొద్దని ప్రజల్ని కోరుతోంది.
మరోవైపు, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ సన్నద్ధమవుతోంది. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై ఇప్పటికే కార్యాచరణ సిద్ధంచేసి ఆ దిశగా ముందుకెళ్తోంది. ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతలు పర్యటిస్తూ ఉచిత విద్యుత్ వంటి హామీలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లోనూ పోటీకి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది నవంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో అన్ని పోటీ చేస్తామని ఆ పార్టీ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జి రత్నేశ్ గుప్తా అన్నారు.