ఎన్నికల్లో ఓటమి తర్వాత విదేశాల్లో స్థిరపడేందుకే ఆ పర్యటనలు.. : మోదీపై లాలూ విమర్శలు

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత విదేశాల్లో స్థిరపడేందుకు ప్రధాని మోదీ అనువైన ప్రదేశాలను వెతుకుతున్నారని లాలూ ఎద్దేవా చేశారు. దేశ ఐక్యతను కాపాడేందుకు భాజపాను ఓడించాలని లాలూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

Published : 31 Jul 2023 11:36 IST

దిల్లీ: ప్రధాని మోదీ (PM Modi) విదేశీ పర్యటనలపై ఆర్జేడీ (RJD) అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) వ్యంగాస్త్రాలు సంధించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖాయమని భావించి విదేశాల్లో స్థిరపడేందుకు ప్రధాని మోదీ అనువైన ప్రదేశాలను వెతుకుతున్నారని లాలూ ఎద్దేవా చేశారు. ఇండియా (INDIA) కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు చేసిన నేపథ్యంలో లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం ఇండియా కూటమి ఏర్పాటుపై ప్రధాని మాట్లాడుతూ.. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు కొత్త కూటమిని ఏర్పాటు చేశాయని ఆరోపించిన విషయం తెలిసిందే.

సుప్రీంను ఆశ్రయించిన వీడియో ఘటన బాధితులు.. పిటిషన్లపై నేడు విచారణ

‘‘లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రధాని మోదీ విదేశాల్లో స్థిరపడాలని భావిస్తున్నారు. అందుకే ఆయన విదేశాల్లో ఎక్కువగా పర్యటిస్తున్నారు. పిజ్జా, మోమోస్‌ను ఆస్వాదిస్తూ.. విదేశాల్లోనే ఆయన విశ్రాంతి తీసుకుంటారు. అందుకు అనువైన ప్రదేశం కోసం ఆయన చూస్తున్నారు’’ అని లాలూ విమర్శించారు. వచ్చే నెలలో ముంబయిలో జరిగే ఇండియా కూటమి సమావేశానికి బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ( Nitish Kumar)తో కలిసి హాజరవనున్నట్లు తెలిపారు. మణిపుర్ ఘటనకు కేంద్రం బాధ్యత వహించాలని లాలూ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన ప్రయత్నాలను ఇండియా కూటమి అడ్డుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ఐక్యతను కాపాడేందుకు భాజపాను ఓడించాలని లాలూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని