మహిళలకు నగదు సాయం, ₹500కే గ్యాస్‌ సిలిండర్‌.. మధ్యప్రదేశ్‌లో ప్రియాంక హామీలు

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో కాంగ్రెస్‌ (Congress) పార్టీ అధికారంలోకి వస్తే, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక తరహాలో ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) హామీ ఇచ్చారు. 

Published : 12 Jun 2023 23:07 IST

జబల్‌పూర్‌: కాంగ్రెస్‌ (Congress) పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో ఎన్నికల హామీలు గుప్పించారు. జబల్‌పూర్‌ (Jabalpur)లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె.. అక్కడి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌ ప్రజలకు కర్ణాటక తరహాలోనే ఐదు హామీలను ప్రకటించారు. ‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందిస్తాం. రూ.500లకే ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌, సగం ధరకే 200 యూనిట్ల కరెంట్‌ను అందిస్తాం. రైతుల రుణాలు మాఫీ చేయడంతోపాటు, రాష్ట్రంలో సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేస్తాం. నర్మదా నదీ తీరం సాక్షిగా ఈ హామీలను ఇస్తున్నాం. మేం అబద్ధాలు చెప్పే వాళ్లం కాదు’’ అని ప్రియాంక అన్నారు. 

ఈ సందర్భంగా భాజపా (BJP)పై ప్రియాంక తీవ్ర విమర్శలు చేశారు. భాజపా డబుల్‌ ఇంజిన్‌, ట్రిపుల్‌ ఇంజిన్‌ గురించి మాట్లాడుతుంది కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చదని ప్రియాంక మాటల దాడి చేశారు.  హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh), కర్ణాటక (Karnataka)లో డబుల్‌ ఇంజిన్‌ గురించి మాట్లాడినందుకే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, ఇకనైనా భాజపా మాటలు చెప్పడం ఆపి, పనిచేయడం నేర్చుకోవాలని హితవుపలికారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ప్రియాంక హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టినప్పటికీ, ధన బలంతో తమ ప్రభుత్వాన్ని కూలదోసి భాజపా అధికారం చేపట్టిందని ఆరోపించారు. కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఐదు గ్యారంటీ పథకాలను ప్రకటించామని, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తున్నామని ప్రియాంక చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని