Priyanka: ఇలాగైతే ప్రజలు దీపావళి చేసుకొనేదెలా..? కేంద్రమే జవాబు చెప్పాలి: ప్రియాంక

కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ  కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిత్యావసర ధరలు పెరుగుతుంటే ప్రజలు దీపావళి పండుగ ఎలా చేసుకోవాలో కేంద్రమే సమాధానం చెప్పాలన్నారు.

Published : 03 Nov 2023 17:54 IST

దిల్లీ: ధరల పెరుగుదల అంశంపై కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రధాని మోదీ సర్కార్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీపావళి పండుగకు వారం రోజుల ముందు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే ప్రజలు దీపావళి ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ పరిస్థితిపై మోదీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఉల్లిపాయలు, చక్కెర, పప్పుల ధరల పెరుగుదలను ప్రస్తావిస్తూ ప్రియాంకా గాంధీ శుక్రవారం ట్వీట్‌ చేశారు.

‘‘దీపావళి వారం రోజులే ఉంది.. కానీ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి ధరలు అకస్మాత్తుగా పెరగడం మొదలైంది. అదే సమయంలో భారతదేశం ఉల్లిని ఉత్పత్తి చేసే రెండో అతిపెద్ద దేశం. గతేడాది రైతు సోదరులు 31లక్షల మెట్రిక్‌ టన్నుల ఉల్లిని ఉత్పత్తి చేశారు. అదంతా ఎక్కడుంది? ఆ బడా వ్యాపారి గిడ్డంగిలోనా? లేదంటే నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ గోదాముల్లోనే కుళ్లిపోయిందా?’’ అని ప్రియాంక ప్రశ్నించారు. మరోవైపు, చక్కెరతో పాటు పప్పులు సైతం పౌరులకు అందుబాటులో లేకుండా పోయాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లేం తింటారు.. మిగతా వాళ్లకు ఏం పెడతారు? ఈ దీపావళి పండుగను ప్రజలు ఎలా సంతోషంగా చేసుకోవాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు.

ఉత్తర భారతమంతా కలుషిత గాలినే పీలుస్తోంది: దిల్లీ మంత్రి

ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ పార్టీ సైతం ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతుండటంతో కేంద్రంపై విమర్శలు చేస్తోంది. 2024 ఎన్నికల్లో మార్పు కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఇటీవల కాంగ్రెస్‌ పేర్కొంది. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే  ద్రవ్యోల్బణాన్ని తగ్గించే విధానాలను అమలు చేస్తామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని