Sharad Pawar: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం: శరద్‌ పవార్‌

కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఎన్సీపీ నేత శరద్‌పవార్‌ ధీమా వ్యక్తం చేశారు.

Published : 08 Apr 2023 14:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Elections) జరగనున్న నేపథ్యంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(NCP) అధినేత శరద్‌పవార్‌ (Sharad Pawar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ (Congress) వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. అందువల్ల కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అయితే వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో (2024 General Elections) భాజపాను ఓడించాలంటే మాత్రం ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘దేశంలో భాజపాయేతర ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నా కొన్ని రాష్ట్రాల్లో భాజపాయేతర పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో భాజపా అధికారంలో లేదు. మధ్యప్రదేశ్‌లో తొలుత కమల్‌నాథ్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. కానీ, ఎమ్మెల్యేలు చేజారిపోవడంతో అధికారం భాజపా చేతుల్లోకి వెళ్లింది. రాజస్థాన్‌, దిల్లీ, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌ ఇంకా చాలా రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వాలే కొలువుదీరాయి. వచ్చే నెల జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్‌కు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి కర్ణాటకలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీనే. అయితే జాతీయ ఎన్నికల విషయానికి వస్తే పరిస్థితి మరోలా ఉంది. జాతీయ ఎన్నికల్లో భాజపాను ఓడించాలంటే మాత్రం ప్రతిపక్షాలన్నీ ఏకమై ముందుకుసాగాలి.  లేదంటే భాజపాను ఓడించడం అసాధ్యం’’ అని పేర్కొన్నారు. కర్ణాటకలో మే10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ముగిసిన మూడు రోజుల తర్వాత ఓట్లను లెక్కిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని