IDIOT Syndrome: ఇడియట్‌ సిండ్రోమ్‌.. ‘ఇంటర్నెట్‌ వైద్యాన్ని’ ఆశ్రయించొద్దు !

IDIOT Syndrome: ఇంటర్నెట్‌లో అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉండటంతో చాలామంది అనారోగ్య సమస్యల నిర్ధరణకూ దాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇది ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం తేవొచ్చు.

Updated : 15 May 2024 17:14 IST

IDIOT Syndrome | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ సమాచారం కావాలన్నా ఒక్క క్లిక్‌తో తెలిసిపోతున్న కాలమిది. ఇంటర్నెట్‌ తెచ్చిన విప్లవాత్మక మార్పిది. వాస్తవానికి దీనివల్ల మానవాళికి ఎంత లబ్ధి జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, అధిక సమాచారం వల్ల కొన్ని రంగాల్లో దుష్పరిణామాలూ తలెత్తాయి. అందులో వైద్యారోగ్యం ఒకటి. ఇక్కడి నుంచి పుట్టుకొచ్చిందే ఇడియట్‌ సిండ్రోమ్‌ (IDIOT Syndrome). ఇంతకీ ఏంటిది? ఎలాంటి పరిణామాలుంటాయి? ఎలా బయటపడొచ్చో చూద్దాం..

ఏంటీ సిండ్రోమ్‌..

ఆరోగ్యంపై ఆందోళనతో అనవసరంగా పదే పదే ఆన్‌లైన్‌లో శోధించడాన్నే ఇడియట్‌ సిండ్రోమ్‌గా చెప్పొచ్చు. ‘ఇంటర్నెట్‌ డెరైవ్డ్‌ ఇన్ఫర్మేషన్‌ అబ్‌స్ట్రక్షన్‌ ట్రీట్మెంట్‌’ సిండ్రోమ్‌నే (IDIOT Syndrome) వైద్య పరిభాషలో సైబర్‌కాండ్రియా అని కూడా అంటారు. చాలామంది ఈ మధ్య తమకున్న లక్షణాల ఆధారంగా ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసి జబ్బు ఏంటో నిర్ధరించుకుంటున్నారు. వైద్యుడిని సంప్రదించకుండానే చికిత్స చేసుకుంటున్నారు.

ఇంటర్నెట్‌లో వివిధ రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలకు సంబంధించిన సమాచారానికి కొదవే లేదు. అయితే, వీటిలో తప్పుడు సమాచారమూ ఉంటుంది. కొన్నిసార్లు పూర్తి వివరాలు అందుబాటులో ఉండవు. ఇడియట్‌ సిండ్రోమ్‌తో (IDIOT Syndrome) బాధపడేవారు వాటిపై ఆధారపడి తప్పుడు నిర్ణయానికి వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కోసారి వారికి లేని సమస్యకు చికిత్స చేసుకోవచ్చు. లేదా నిజంగా ఆందోళన చెందాల్సిన వ్యాధి ఉన్నా గుర్తించలేకపోవచ్చు.

ఇడియట్‌ సిండ్రోమ్‌ లక్షణాలు..

 • ఈ సిండ్రోమ్‌తో బాధ పడేవారు తీవ్ర ఆందోళనలో ఉంటారు.
 • చిన్నపాటి లక్షణాలకే తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు ఆందోళన చెందడం.
 • వైద్య సమాచారం కోసం గంటలతరబడి అనవసరంగా ఆన్‌లైన్‌లో శోధించడం.
 • ఆన్‌లైన్‌లో లభించిన సమాచారం ఆధారంగా దిగులు చెందడం.
 • ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తున్నప్పుడు చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం.
 • ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు సంబంధించి విపరీత నిర్ణయాలు తీసుకోవడం.
 • వైద్యులు ఇచ్చే సమాచారాన్ని విశ్వసించకపోవడం.

ఎలాంటి ప్రభావం ఉంటుంది

పూర్తిగా ఆన్‌లైన్‌ సెర్చ్‌పై ఆధారపడితే జబ్బును తప్పుగా నిర్ధరించే ప్రమాదం ఉంది. ఫలితంగా ఒక వ్యాధికి మరో చికిత్స తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు. ఉన్న వ్యాధి మరింత ముదిరి ప్రాణానికే ముప్పు రావొచ్చు. పైగా పదే పదే ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తూ తీవ్ర ఆందోళనకు గురై మానసికంగానూ దెబ్బతినొచ్చు. ఆన్‌లైన్‌లో సాధారణంగా అందరిలో కనిపించే లక్షణాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. అవి ఉన్నంతమాత్రాన కచ్చితంగా అదే జబ్బని నిర్ధరించాల్సిన అవసరం లేదు.

ఎలా బయటపడాలి..

 • చిన్నపాటి లక్షణాలున్నంత మాత్రాన కొంతమంది వారికి వారే ఏదో పెద్ద అనారోగ్యం ఉన్నట్లు కుంగిపోతుంటారు. ఇది మరింత ఆందోళన, మానసిక సమస్యలకు దారితీస్తుంది. ఈనేపథ్యంలో వైద్యులు ధ్రువీకరించకుండా ఎవరూ ఎలాంటి నిర్ణయానికి రావొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమని తాము తక్కువ చేసుకోవద్దు.
 • ఆందోళన నుంచి బయటకు రావడానికి కొన్ని రిలాక్సేషన్‌ టెక్నిక్‌లను పాటించొచ్చు. దీర్ఘశ్వాస, ధ్యానం, కండరాలను వదులు చేసే వ్యాయామాల వంటి వాటిని ప్రయత్నించొచ్చు.
 • ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారమంతా నిజం కాదనే వాస్తవాన్ని గుర్తించాలి. పైగా ఒక అనారోగ్య సమస్యను మీకు మీరే నిర్ధరించుకునే నిపుణులు కాదనే స్పృహలో ఉండాలి. ఆ దిశగా వచ్చే అన్ని ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి.
 • ఒకవేళ ఎంత ప్రయత్నించినా ఆందోళన నుంచి బయటకు రాకపోతే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.

టెక్నాలజీ మెరుగవుతున్నకొద్దీ ఇడియట్‌ సిండ్రోమ్‌ మరింత విస్తరిస్తోంది. అనారోగ్య సమస్యలపై అవగాహన ఉండడం మంచిదే అయినప్పటికీ.. ఇంటర్నెట్‌లోని సమాచారం ఆధారంగా నిర్ణయాలకు రావడం మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అందుకే నిజంగానే మీకు ఆరోగ్య సమస్య ఉందా? లేక ఇంటర్నెట్‌లో సమాచారం ఆధారంగా ఆందోళన చెందుతున్నారా? గుర్తించాలి. ఏదైనా ఒక నిర్ణయానికి రావడానికి ముందు వైద్యులను సంప్రదించడం మేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని