Karnataka : మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలా.. హై కమాండ్‌ చెబితే ఓకే : సిద్ధరామయ్య

కర్ణాటకలో (Karnataka) మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను (deputy chief ministers) నియమించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. దానిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య (Siddaramaiah) తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Published : 17 Sep 2023 18:16 IST

బెంగళూరు : కర్ణాటకలో (Karnataka) మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను (deputy chief ministers) నియమించాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. ఆ అంశంపై నిర్ణయం హై కమాండ్‌పైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. హై కమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.  మంత్రి రాజన్న శనివారం మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. ‘మంత్రి రాజన్న ఆయన మనసులోని మాట చెప్పారు. ఏదేమైనా దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది హై కమాండ్‌ మాత్రమే. ఒక ఉప ముఖ్యమంత్రి సరిపోతారని హై కమాండ్‌ భావించింది కాబట్టే ఒకరిని నియమించింది. మరో మగ్గురిని నియమించే అంశం పరిశీలించాలని హై కమాండ్‌తో మాట్లాడతానని రాజన్న అంటున్నారు. ఆయనను మాట్లాడనివ్వండి’ అని చెప్పారు. 

ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశాలు.. తెలంగాణ ప్రజలకు నేతల కీలక విజ్ఞప్తి

ఉప ముఖ్యమంత్రుల నియామకం గురించి చెప్పడానికి ప్రస్తుతం తన వద్ద ఎలాంటి సమాచారం లేదని సిద్ధరామయ్య అన్నారు. హై కమాండ్‌ నిర్ణయమే తనకు శిరోధార్యమని వ్యాఖ్యానించారు. మంత్రి రాజన్న శనివారం మాట్లాడుతూ కొత్తగా మరో మూడు డిప్యూటీ సీఎంలను నియమించాలని డిమాండ్ చేశారు. వాటిని వీరశైవ-లింగాయత్, ఎస్సీ-ఎస్టీ, మైనారిటీలకు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్‌ ఏకైక ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కర్ణాటక రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సైతం ఆయనే. ఈ ఏడాది మేలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సిద్ధరామయ్య, శివకుమార్‌లలో సీఎంగా ఎవరిని నియమించాలనే విషయంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తర్జనభర్జన పడింది. చివరికి శివకుమార్‌ను బుజ్జగించి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరింది. అధిష్ఠానం నిర్ణయానికి ఓకే చెప్పిన శివకుమార్‌ ఆ పోస్టులో కొనసాగుతున్నారు. 

ఇదిలా ఉండగా మంత్రి రాజన్న వ్యాఖ్యలను హోంమంత్రి జి.పరమేశ్వర సమర్థించారు. గతంలోనే డిప్యూటీ సీఎం పోస్టు ఆశించిన ఆయన రాజన్న మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చి.. వారిలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన అవసరం ఉందన్నారు. రాజన్న వ్యక్తం చేసిన అభిప్రాయంతో హై కమాండ్‌ ఏకీభవిస్తుందో.. లేదో వేచి చూడాలన్నారు. దళిత నేతగా గుర్తింపు పొందిన పరమేశ్వర గతంలో కేపీపీసీ అధ్యక్షుడిగా పని చేశారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని