Ts News: తెరాసలో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి తెరాసలో చేరారు. కౌశిక్‌రెడ్డికి కండువా కప్పిన సీఎం కేసీఆర్‌.. పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌

Updated : 12 Oct 2022 14:42 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి తెరాసలో చేరారు. కౌశిక్‌రెడ్డికి కండువా కప్పిన సీఎం కేసీఆర్‌.. పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన ‘తెరాస టికెట్‌ తనకేనంటూ ఓ నాయకుడితో ఆడియో సంభాషణ’ బయటపడిన తరువాత పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరులు, అభిమానులతో సంప్రదింపులు జరిపిన తరువాత తెరాసలో చేరిపోయారు. పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..‘‘రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని కౌశిక్‌రెడ్డి తెరాసలోకి వచ్చారు. యువనేత కౌశిక్‌రెడ్డి తెరాసలో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. కౌశిక్‌రెడ్డి, ఆయన అనుచరులను సాదరంగా తెరాసలోకి ఆహ్వానిస్తున్నాను. కౌశిక్‌రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి నాతో కలిసి పనిచేశారు. కౌశిక్‌ రెడ్డికి తెరాసలో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆయనకు చిన్న పదవి ఇచ్చి సరిపెట్టను. నాడు చెన్నారెడ్డి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రజాసమితి అప్పట్లోనే 11 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఎన్టీఆర్‌ అవకాశమిస్తే ఎమ్మెల్యే అయ్యాను. కష్టపడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి పథకం వెనుక ఎంతో మథనం ఉంది. గొర్రెల పెంపకం విషయంలో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.

‘దళిత బంధు’ ఎన్నికల కోసం కాదు..

‘‘కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎస్సీలు నిరుపేదలుగానే ఉన్నారు. పేదరికం, సామాజిక వివక్షను ఎస్సీలు ఎదుర్కొంటున్నారు. దళిత బంధు చూసి కొందరికి బీపీ పెరుగుతోంది. అలాంటి వారి ధ్యాసంతా ఓటుపైనే. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉంది. దళిత బంధు పథకం ఎన్నికల కోసం తీసుకొచ్చింది కాదు. అది కుటుంబ రక్షణ  ప్రత్యేక నిధి. ఈ పథకం ద్వారా రూ.10 లక్షలు నగదు ఇస్తాం. ఆ రూ.10 లక్షలకు లబ్ధిదారే పూర్తి హక్కుదారు. దళిత బంధు లబ్ధిదారులు జన్మలో మళ్లీ పేదరికంలోకి రారు. నన్ను విమర్శించిన వారి కళ్లముందే ఇవాళ తెలంగాణ వచ్చింది. రైతు బంధు పథకంపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. విమర్శలను పటాపంచలు చేస్తూ రైతుబంధును విజయవంతంగా అమలు చేస్తున్నాం. ఎవరు ఏ కులంలో పుడతారో ఎవరికీ తెలియదు. ఎవరైనా దరఖాస్తు చేసుకుని ఫలానా కులంలో పుడతారా? ఊరు, సమాజం బాగుంటే.. మనం బాగుంటాం’’ అని సీఎం వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని