Sonia Gandhi: రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ ఖాయమేనా? సూచనప్రాయంగా చెప్పిన సోనియా

Sonia Gandhi: రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయడం దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. ఆ ప్రాంత ప్రజలకు రాసిన లేఖలో కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు.

Published : 15 Feb 2024 15:41 IST

దిల్లీ: సుదీర్ఘకాలం పాటు లోక్‌సభ సభ్యురాలిగా వ్యవహరించిన కాంగ్రెస్‌ (Congress) అగ్ర నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఇక రాజ్యసభలో అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌ నుంచి పెద్దల సభకు వెళ్లేందుకు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత పాతికేళ్లుగా తాను ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని రాయ్‌బరేలీ (Rae Bareli) లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు ఆమె గురువారం భావోద్వేగభరిత లేఖ రాశారు. వయసు, ఆరోగ్య సమస్యల కారణంగానే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు. అదే సమయంలో ఈ స్థానం నుంచి తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) పోటీ గురించి కూడా ఆమె సూచనప్రాయంగా వెల్లడించారు.

‘‘రాయ్‌బరేలీతో మా కుటుంబానికి బలమైన బంధం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో మా మామయ్య ఫిరోజ్‌ గాంధీని మీరు (రాయ్‌బరేలీ ప్రజలనుద్దేశిస్తూ) గెలిపించి దిల్లీకి పంపించారు. ఆ తర్వాత మా అత్తయ్య ఇందిరాగాంధీని మీ సొంతమనిషిలా మార్చేసుకున్నారు. అప్పటి నుంచి ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మా కుటుంబంపై మీ ఆప్యాయతను చాటుతూనే ఉన్నారు. కష్టనష్టాల్లో నాకు అండగా నిలిచారు. ఇది ఎన్నటికీ మర్చిపోలేను’’ అని సోనియా గాంధీ రాసుకొచ్చారు.

‘ఎన్నికల బాండ్లు’ రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీం సంచలన తీర్పు

‘‘మీ వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. కానీ ఇప్పుడు వయసు, ఆరోగ్య సమస్యలు రావడంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నా. ఈ నిర్ణయంతో మీకు నేరుగా సేవ చేసే అవకాశం లేకపోవచ్చు. అయినా, నా హృదయం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. ఇన్నేళ్ల మాదిరిగానే భవిష్యత్తులోనూ నా కుటుంబానికి మీరు మద్దతుగా నిలబడతారని ఆశిస్తున్నా’’ అని అభ్యర్థించారు. అంటే వచ్చే ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి గాంధీ కుటుంబసభ్యులే పోటీ చేయనున్నట్లు సోనియా సూచనప్రాయంగా వెల్లడించారు. దీంతో అక్కడి నుంచి ప్రియాంక బరిలోకి దిగడం దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది.

1999లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన సోనియా గాంధీ.. యూపీలోని అమేఠీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2004లో రాయ్‌బరేలీకి మారారు. నాటి నుంచి ఇప్పటివరకు అదే స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో అమేఠీలో రాహుల్ గాంధీ ఓటమి చవిచూసినా.. సోనియా మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని